రజినీకాంత్ కు కౌంటర్ ఇచ్చిన కమల్!

Monday, June 4th, 2018, 03:11:53 PM IST

మొన్నటి వరకు తమిళ నాడు రాజకీయాల్లో రెండు మూడు పార్టీల మధ్యనే మాటల తూటాలు పేలాయి. కానీ ఇప్పుడు మరికొంత మంది రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆ డోస్ కాస్త ఎక్కువైంది. స్టార్ హీరోలు రజినీకాంత్ – కమల్ హాసన్ ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో వరుసగా విమర్శలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తమిళ నాడులో స్టెరిలైట్ ఫ్యాక్టరీ విషయం హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీని మూయించడానికి చట్టం తీసుకువచ్చింది.

అయితే ఆందోళనలపై ఇటీవల రజినీకాంత్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి సమస్యకు ఆందోళనకారులు రోడ్డెక్కితే తమిళనాడు శ్మశానంలా మారుతుందని సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలకు మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఆందోళన చేసే వారు సంఘ విద్రోహులు అయితే అందులో నేను కూడా ఉన్నాను. తుపాకీతో పోరాడటమే నిరసనలు కాదు. తుపాకీ గర్జించే పరిస్థితి వస్తే.. ప్రజలు దాన్ని దైర్యంగా ఎదుర్కోవాలి. ఆందోళన చేసే సమయంలో హింస వంటి పరిస్థితి వస్తే దాన్ని తగ్గించాలి. అంతే గాని ఉద్యమాలను నీరుగార్చకూడదని ఉద్యమాలకు ఓ లక్ష్యం ఉంటుందని కమల్ హాసన్ రజినీకాంత్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. చెన్నై ఎయిర్‌పోర్టు వద్ద మీడియా ద్వారా ఈ విషయాన్ని కమల్ చెప్పారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీఎస్ నేత కుమారస్వామిని కలిసేందుకు కమల్ వెళ్లారు.