కమల్ “టార్చ్ బేరర్” అవనున్నాడా..?

Sunday, March 10th, 2019, 12:54:10 PM IST

కమల్ హాసన్ పార్టీ “మక్కల్ నీది మయ్యం” కి ఎన్నికల సంఘం “బ్యాటరీ టార్చ్” గుర్తును కేటాయించింది, ఈ మేరకు కమల్ హాసన్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఎన్నికల సంఘానికి కృతఙ్ఞతలు తెలిపారు. తమ పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేసిన కమల్, తమిళనాడు, దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలకబోతోందని, ఎంఎన్ఎం పార్టీ “టార్చ్ బేరర్” అవ్వబోతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కమల్ హాసన్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగేందుకు సిద్ధమౌతున్నారు.

మొదటి నుండి కమల్ బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలతో విభేదిస్తూ వస్తున్నారు, ఆ మధ్య కాంగ్రెస్ తో కమల్ కలవనున్నారని వార్తలొచ్చాయి. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా సుముఖంగా ఉన్నట్టు, దీనికి సంకేతంగా తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు అళగిరి చర్చలు కూడా జరిపారు. అయితే ఇటీవల కాంగ్రెస్ డీఎంకేతో పొత్తు పెట్టుకోనుందని ప్రకటించింది, దీంతో డీఎంకేను కమల్ విభేదిస్తున్నారు కబట్టి కాంగ్రెస్ తో కలిసే అవకాశం లేనట్లే అని తెలుస్తుంది. తమిళనాడు రాజకీయాలపై కమల్ ప్రభావం ఏ మేరకు ఉండబోతోందో చూడాలి.