పార్టీని ప్రకటించిన కమల్ హాసన్ !

Thursday, February 22nd, 2018, 03:55:19 AM IST

తమిళ రాజకీయాల్లోకి మరొక కొత్త పార్టీ ఆవిర్భవించింది. మధురైలో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష మధ్యన విశ్వ నటుడు కమల్ హాసన్ కొద్దిసేపటి క్రితమే తన పొలిటికల్ పార్టీని ప్రకటించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన కమల్ పార్టీ పేరు ‘మక్కల్ నీతి మయ్యం’ అని ప్రకటించారు. ‘మక్కల్ నీతి మయ్యం’ అనగా ‘పీపుల్స్ జస్టిస్ పార్టీ’ అని అర్థం.

పార్టీ జెండాలో చేయి చేయి కలిసిన గుర్తు ప్రజల్లోని ఐకమత్యాన్ని తెలియజేసేదిగా ఉండగా అందులోని నలుపు, తెలుపు రంగులు తమిళనాడు రాజకీయాల్లోని ముఖ్య పార్టీల జెండాలను గుర్తు చేస్తున్నాయి. పార్టీ పేరును ప్రకటించిన అనంతరం మాట్లాడిన కమల్ ‘ఈ పార్టీ ప్రజలది. నేను నాయకుడ్ని కాదు. మీ చేతిలో ఆయుధాన్ని. ఇది ఒక్క రోజు వ్యవహారం కాదు. ప్రజాసేవకుడిగా కొనసాగుతూ, మీకు జవాబుదారిగా ఉంటాను. మనమంతా కలిసి కోరుకుంటున్న మార్పును సాధించుకుందాం’ అన్నారు.

కమల్ ప్రసంగం, పార్టీ ముఖ్య ఉద్దేశ్యాలను విన్న ప్రజలు, అభిమానులు జయ జయద్వానాలతో కమల్ కు అభివాదాలు చేశారు. ఈ సభకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరవడం విశేషం. పార్టీ ప్రకటనకు ముందు కమల్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోని ముఖ్యులను, కొందరు జాతీయస్థాయి నాయకుల్ని కలిసి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని ప్రజలు, రాజకీయవాదులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.