ప్రజలకోసం కమల్ హాసన్ కొత్త యాప్.. మయ్యమ్ విజిల్

Tuesday, May 1st, 2018, 01:16:50 PM IST

తమిళ సూపర్‌స్టార్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మయ్యమ్ విజిల్ పేరుతో కొత్త మొబైల్ యాప్‌ను తయారు చేయించారు. ఆ యాప్ ను ఈరోజే విలాన్చ్ చేశారు. సామాజిక, రాజకీయ సమస్యలను ఈ యాప్ ద్వారా నేరుగా కమల్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అల్వార్‌పేట్‌లోని పార్టీ ఆఫీస్‌లో కమల్ ఈ యాప్‌ను అఫీషియల్ గా ఆవిష్కరించారు. అయితే ఇదేమీ మంత్రదండం కాదని, సమస్యలన్నీ ఈ యాప్ ద్వారా పరిష్కారం కావని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాప్ ద్వారా నాకు ఇంకాస్త తొందరగా తెలుసుకొనే అవకాశం కలుగుతుందని కమల్ అన్నారు.

ఈ యాప్ ద్వారా మీడియా చేసే పనిని సగటు పౌరుడు కూడా చేయొచ్చని కమల్ చెప్పారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నేతలు మద్దతుగా ఉంటారు. కాలుష్యం, నేరాలు, అవినీతి, ఇతర అన్ని అంశాలను ఈ యాప్ ద్వారా అందరి దృష్టికి తీసుకురావచ్చు. పరిష్కారం దిశగా ఇది తొలి అడుగు అని కమల్ తెలిపారు. ఈ యాప్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాకపోయినా సమస్యల పరిష్కారంలో సాయం చేస్తుందని అన్నారు. గతంలో ఎడిటర్‌కు లేఖలు రాసేవాళ్లం. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో రాస్తున్నాం. కానీ వాటిని పదేపదే తెరపైకి తీసుకొచ్చే ఏజెన్సీ మాత్రం ఏదీ లేదు. అందుకే ఈ యాప్ తీసుకొచ్చాం అని కమల్ చెప్పారు.

ఇక నకిలీ వార్తలను పోస్ట్ చేసి యాప్‌ను దుర్వినియోగం చేసేవాళ్ల కోసం యాప్‌లో ప్రత్యేకంగా ఫిల్టర్స్‌ను ఏర్పాటుచేశామని, పదేపదే ఇలాంటి వార్తలను పోస్ట్ చేస్తే ఆ వ్యక్తిని శాశ్వతంగా నిషేధించనున్నట్లు తెలిపారు. ఈ యాప్ ప్రస్తుతానికి తమిళనాడు, పుదుచ్చెరి ప్రాంతాల్లో ఉంటూ మక్కల్ నీది మయ్యమ్ సభ్యులుగా రిజిస్టర్ చేసుకున్నవాళ్లకే అందుబాటులో ఉంది. అంతే కాకుండా సమస్యలు పరిష్కరించిన డేటాను ఈ యాప్ లో చూడవచ్చని దాని ద్వారా ప్రజలకు ఎంత మేరకు అభివృద్ధి జరగుతుంది అన్న విషయం కూడా తెలుసుకోవచ్చు అని అన్నారు.

Comments