1000 కోట్ల కుంభకోణంలో చిక్కిన కనిష్క్ జ్యుయలరీ

Wednesday, March 21st, 2018, 05:17:30 PM IST

జ్యుయలరీ షాపులు మనుషులనే కాదు ఏకంగా బ్యాంకులను కూడా మోసం చేయడం మొదలు పెట్టాయి. ఇటివల ప్రముఖ జ్యూయలరీ సంస్థ బ్యాంకులను భారీగా మోసగించినట్లు తాజాగా మ‌రో సంఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.842.15కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. చెన్నైలో టీ నగర్‌లో రిజస్టర్ అయిన కనిష్క్ గోల్డ్ సంస్థకు భూపేశ్ కుమార్ జైన్ అత‌ని భార్య నీతా జైన్ ప్రమోటర్లు, డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్లిద్దరి ఆచూకీ తెలుసుకోలేకపోతున్నామని, వాళ్లు ప్రస్తుతం మారిషస్‌లో ఉంటున్నారని భావిస్తున్నట్లు బ్యాంకింగ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 14 బ్యాంకుల కన్సార్టియం కనిష్క్‌కు రుణాలిచ్చాయి. కనిష్క్ జ్యూయలరీ రికార్డులను తారుమారు చేయడం, రాత్రికి రాత్రే షాపులను మూసివేసిందని ఈ ఏడాది జనవరి 25న సీబీఐకి ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. రుణం ఇచ్చిన మొత్తం రూ.824 కోట్లు కాగా వడ్డీతో కలుపుకుంటే బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1000కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది. కనిష్క్ గోల్డ్ రుణాలు చెల్లించకపోవడంతో యాజమానిని రుణ ఎగవేతదారుడిగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ 2017 నవంబర్ 11న తొలిసారి ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం మిగతా బ్యాంకులు మోసాన్ని నియంత్రణ సంస్థకు ఫిర్యాదు చేశాయి. ఎలాగైనా తప్పించుకు పారిపోయిన భూపేశ్ కుమార్ జైన్ అత‌ని భార్య నీతా జైన్ లను పట్టుకనునేందుకు సిబీఐ తీవ్రంగా గాలిస్తున్నట్టు సమాచారం.