జనాలకు ఆ మూడ్ లేదులే కత్తి మహేష్ !

Monday, October 1st, 2018, 10:21:39 AM IST

ఈ మధ్య పాలిటిక్స్ అంటే మరీ జోక్ అయిపోయింది. జనాలకు ఏం చేశాం, వాళ్ళ తరపున ఎన్నాళ్ళ నుండి ఉన్నాం అనేవి ముఖ్యం కాదు వాళ్లకు మన పేరు తెలిసి ఉంటే చాలు నాయకులం అయిపోవచ్చు అనుకునే వ్యక్తులు భలేగా తయారవుతున్నారు. అలా తయారైన వారిలో కత్తి మహేష్ కూడ ఒకరు. సినీ విమర్శకుడిగా కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆయన అనూహ్య రీతిలో తెర మీదికి వచ్చారు. పవన్ ను తెగ విమర్శించి, పవన్ అభిమానులతో గొడవలు పెట్టుకుని, నేను దళితుడిని అని చెప్పుకుని టీవీ డిబేట్లలో తిష్ట వేశాడు.

ఇక మన ఓవరాక్షన్ మీడియా కొన్ని నెలలు శ్రమపడి అతన్ని ఫేమస్ చేసింది. ఎంతలా అంటే ఏళ్ళ తరబడి సాగే డైలీ సీరియళ్లను తట్టుకునే ఓపికున్న మన తెలుగు టీవీ ప్రేక్షకులకు కూడ విసుగొచ్చేంతగా. ఈ వ్యవహారం మొత్తం వెనుక రాజకీయ హస్తం ఉన్నట్టు జనాలకు మొదటి నుండి బలమైన అనుమానం ఉంది. అలా వివాదాస్పందంగా మొదలైన కత్తి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురయ్యాక మకాంను ఆంధ్రాకు మార్చారు.

ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకున్న ఆయన దళితులకు అన్ని పార్టీలు అన్యాయం చేశాయని దళితుల తరపున వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని సెలవిచ్చారు. అంతేకాదు నిశ్శబ్దంగా ఏదో రాష్ట్ర పర్యటన కూడ చేస్తున్నారట. అన్ని పార్టీలను ఒకేసారి విమర్శించిన ఆయన చిత్తూరు నుండి పోటీకి దిగాలనుకుంటున్నారని టాక్. ఏమాత్రం గ్రౌండ్ వర్క్ లేకుండా, ఏనాడు జనాలతో కలిసి నడవకుండా కేవలం టీవీల్లో నాలుగు నెలలు హల్ చల్ చేసి ఇప్పటికిప్పుడు ఎంపీగా నిలబడతానంటున్న కత్తి రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా అక్కడి జనాలను కానేసా రీతిలో కూడ ప్రభావితం చేసే ఛాన్స్ లేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేసే మూడ్ లో ప్రజలు కూడ లేరు.