ప్రాజెక్టుల పేరుతో బాబును ఆడేశాడే!

Tuesday, November 20th, 2018, 03:53:05 AM IST


ప్ర‌తిసారీ తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో గులాబీ బాస్ లు వాడేస్తున్న ఏకైక అస్త్రం నీటి ప్రాజెక్టులు. వీటిని అడ్డుకున్న తేదేపాను రానిస్తారా? అంటూ తెలంగాణ‌లో ప్ర‌చారం చేస్తూ దూసుకుపోతున్నారు. నిన్న కేటీఆర్‌, నేడు కేసీఆర్ అదే ప్ర‌స్థావించి చంద్ర‌బాబు- కాంగ్రెస్ కూట‌మిపై విరుచుకుప‌డ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఖ‌మ్మంలో ప్ర‌చారాన్ని నిర్వ‌హించిన తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. ఖ‌మ్మం ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టిన సీతారామ ప్రాజెక్టుకు ఆటంకాల్ని క‌లిగిస్తూ ఆ ప్రాజెక్ట్ ను ఆపేయాల‌ని కేంద్రానికి లేఖ‌లు రాసిన చంద్ర‌బాబు బేష‌ర‌తుగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, అప్పుడే అత‌న్ని తెలంగాణ‌లో అడుగుపెట్ట‌నిస్తామ‌ని ఆల్టిమేట‌మ్ జారీ చేశాడు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెదెపా ఖ‌మ్మం జిల్లాకు నీరివ్వ‌కుండా ఎండ‌బెట్టాయ‌ని విమ‌ర్శంచారు.

మ‌న ప్రాజెక్టుల‌ను అడ్డుకున్న వారిని గెలిపించి మ‌న కంటినే పొడుచుకుందామా? అని ఎదురు ప్ర‌శ్నించారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు చేసిన మాట వాస్త‌వం కాదా?. ఈ ప్రాజెక్టును అడ్డుకోవ‌డం కోసం చంద్ర‌బాబు కేంద్రానికి రాసిన లేఖ‌ను వెన‌క్కు తీసుకుంటాడో లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల్ని మోసం చేసిన చంద్ర‌బాబు మ‌ళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల‌డుగుతాడ‌ని మండిప‌డ్డారు. ఎవ‌రు ఎన్ని కుయుక్తులు ప‌న్నినా ఖ‌మ్మంలో గెలుపు మాదే అని కేసీఆర్‌ ధీమా వ్య‌క్తం చేశారు. ఇది పోరాటాల గ‌డ్డ అని ఇక్క‌డ తెరాస క్లీన్ స్వీప్ చేయ‌బోతోంద‌ని, 10 సీట్ల‌కు ప‌ది తెరాస ఖాతాలో ప‌డ‌బోతున్నాయ‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కులాల కుల్లు, దొంగ డ‌బ్బు ప్ర‌భావం… ఇవ‌న్నీ ఖ‌మ్మం ప్ర‌జ‌ల చైత‌న్యం ముందు నిల‌బ‌డ‌వ‌ని తేల్చి చెప్పారు.