కోదండపై కేసీఆర్ బీ-టీమ్ క‌న్ను?!

Friday, May 4th, 2018, 03:16:02 AM IST

తెలంగాణ ఉద్య‌మ క‌ర్త‌.. నిజాయితీప‌రుడైన ప్రొఫెసర్ కోదండ‌రామ్ రాజ‌కీయ పార్టీ పెట్టి జోరు పెంచ‌డం టీఆర్ఎస్‌లో గుబులు పెంచుతోంది. ఆయ‌న రాష్ట్ర స్థాయిలో ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇంచార్జీల జాబితాను ప్రకటించారు. ప్రతి జిల్లాకు కమిటీలను వేసి గ్రామస్థాయి వరకూ ప్రజలలోకి పార్టీని తీసుకువెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు మొద‌లెట్టారు. ప్ర‌త్యామ్నాయ రాజకీయాల కోసం ఏర్పాటైన తెలంగాణ జనసమితి దృష్టి ఇప్పుడు జిల్లా స్థాయి రాజకీయాల వైపు మళ్ల‌డంతో తేరాస‌లో గుబులు ఇంకా ఇంకా అంత‌కంత‌కు రెట్టింప‌వుతోంద‌న్న‌ది ఇన్‌సైడ్ టాక్‌.

కోదండ పావుల్ని వేగంగా క‌దుపుతున్నారు. ఆయ‌న వెన‌క ఏదో శ‌క్తి బ‌లంగా ప‌ని చేస్తోంద‌ని మాట్లాడుకుంటున్నారు. ఇక ఆయ‌న జిల్లా స్థాయిలో తాత్కాలిక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, టీజేఎస్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసుకొనే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రస్తుతం టీజేఎస్ నిర్మాణాన్ని పెంచుకోవడం తమ ముందున్న తక్షణ కర్తవ్యంగా టీజేఎస్ నాయకులకు దిశానిర్ధేశ‌నం చేస్తున్నారు. క‌మిటీలు, స‌ద‌స్సులు అంటూ వేడి పెంచేస్తున్నారు. ప‌నిలోప‌నిగా విక‌లాంగులు, మ‌హిళ‌ల‌కు గాలం వేస్తున్నారు. వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు పరచడానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని, కలాంగుల హక్కుల చట్టం ప్రకారం వికలాంగులు అభ్యున్నతి పొందడానికి వారికి సౌకర్యాలు కల్పించాలని, ఆ అవకాశాలను ప్రభుత్వం కల్పించే విధంగా చట్టం సరిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోదండ కోరారు. విక‌లాంగుల కోసం ఒక టీమ్‌ని, మహిళా విభాగం తరపున క్రింది స్థాయి వరకూ నిర్మాణ బాధ్యతలు కమిటీ నాయకురాళ్ల‌ను నియ‌మించి జోరు చూపిస్తున్నారు. ఇదంతా చూస్తున్న తేరాస నాయ‌కుల్లో మాత్రం గుబులుగుబులుగా ఉంద‌ని అప్పుడే అన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. దీంతో కేసీఆర్‌లోనూ భేజారుత‌నం మొద‌లైంద‌ని కోదండ ప్ర‌తి యాక్టివిటీ కోసం ఒక బీటీమ్‌ని ఏర్పాటు చేసి బ‌రిలో దించార‌ని చెబుతున్నారు.

Comments