కేసీఆర్ దెబ్బ‌: ఆ 35 మంది ల‌బోదిబో

Saturday, September 22nd, 2018, 10:13:18 AM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఎత్తుగ‌డ‌ల్ని అంచ‌నా వేయ‌డం ఎవ‌రిత‌రం కాదు. చాణ‌క్యుడినే త‌ల‌ద‌న్నే మంత్రాంగం ఆయ‌న సొంత‌మ‌ని జాతీయ స్థాయి నాయ‌కులే ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే ఆయ‌న ముంద‌స్తు స‌మ‌రానికి సిద్ధ‌మ‌య్యార‌ని చెబుతున్నారు. 105 నియోజ‌క‌వ‌ర్గాలకు సంబంధించిన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌తిప‌క్షాల‌కు విస్మ‌యం క‌లిగించిన కేసీఆర్ ఈ జాబితాలో భారీ మార్పులు చేర్పులు చేసే అవ‌కాశం వున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ముంద‌స్తు ప్ర‌క‌ట‌న‌తో పాటు 105 మంది అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఈ జాబితా నుంచి 35 మందిని తొలగించి ఆ స్థానంలో ఇత‌రుల పేర్ల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం వున్న‌ట్లు తెలిసింది.

ఈ 35 మంది గురించి ఆయా నియోజ‌క‌వ‌ర్గాలలో ఎలాంటి ప్ర‌చార ఆర్భాటాలు కానీ..ఫ్లెక్సీలు కానీ పెట్ట‌రాద‌ని, టీవీ ఛానెల్స్‌కు అన‌వ‌స‌రంగా డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌రాద‌ని కేసీఆర్ పార్టీ వ‌ర్గాల‌కు హుకుం జారీ చేసిన‌ట్లు తెలిసింది. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాలలో తేరాసా నుంచి టికెట్‌లు ఆశించిన ఆశావాహులు పెద్దాయ‌న‌కు ఎదురు చెప్ప‌లేక…ఏం జ‌రుగుతుందో అర్థం కాక స‌త‌మ‌తమ‌వుతున్నార‌ట‌. అయితే మిగిలిన 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ప్ర‌చారం జోరుగా సాగుతున్న‌ది. దీంతో 35 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల మార్పు అనివార్య‌మ‌నే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో తెరాస నే కాకుండా ప్ర‌తి ప‌క్ష పార్టీల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. హుటా హుటిన ప్ర‌క‌టించ‌డం ఎందుకు…మ‌ళ్లీ ఆ జాబితాలో మార్పులు చేయ‌డం ఎందుకు అంటున్నారు.

షాకింగ్ విష‌యం ఏంటంటే కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగే ఈటల రాజేంద‌ర్ ఈ ద‌ఫా గెలిచే అవ‌కాశం లేద‌ని, అత‌ని త‌ర‌హాలోనే మ‌రికొంత మంది ఇంటిదారి ప‌ట్టే అవ‌కాశం వుంద‌ని స‌ర్వేలు తేల్చ‌డంతో కేసీఆర్ తుది జాబితాలో మ‌ళ్లీ మార్పులు చేయాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబ పాల‌న న‌చ్చ‌కే ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయాన్ని కోరుకుంటున్నార‌ని, ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని, ఆ భ‌యం వ‌ల్లే కేసీఆర్ ముంద‌స్తుకు సై అన్నార‌ని, అదే త‌మ‌కు మేలు చేస్తుంద‌ని కాంగ్రేస్‌, టీడీపీ, బీజేపీ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతున్నాయి. అయితే గులాబీ బాస్ ఇలాంటి స‌న్నివేశాన్ని కూడా త‌న‌వైపు ఎలా తిప్సేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని, ఆ ప్ర‌త్యేక‌త త‌న‌కుంద‌ని విశ్లేషిస్తున్నారు.