కేసీఆర్ క్యాబినెట్ లోకి ఇద్దరు మహిళా మంత్రులు?

Friday, January 26th, 2018, 02:40:37 PM IST


నూతన రాష్ట్రం తెలంగాణాలో అధికార ప్రభుత్వం టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది. ఐతే ఈ మధ్య కాలం లో డిప్యూటీ సియం గా వున్న టి రాజయ్యను బర్తరఫ్ చేసి ఆయన స్థానంలో కడియం శ్రీహరి ని ఆయన క్యాబినెట్ లో కి తీసుకుని డిప్యూటీ సియం ని చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి కేసీఆర్ ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటినుండి ఇప్పటివరకు డిప్యూటీ సియం ని భర్తీ చేయడం తప్ప ఆయన కాబినెట్ లో పెద్దగా మార్పులు జరగలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మంత్రి వర్గ ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నట్లు, వీలును బట్టి అది ఈనెల ఆఖరున లేదా వచ్చే నెలలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత క్యాబినెట్ లోని కొంత మంది మంతుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధిష్టానం మార్పులు చేయనుందని తెలుస్తోంది. ఇందులో కొందరిని అనారోగ్య కారణాల వల్ల, మరి కొందరిని సీనియారిటీ దృష్ట్యా తప్పించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చెప్తున్నారు. అయితే కేసీఆర్ కాబినెట్ లో ఇప్పటివరకు మహిళా మంత్రులకు అవకాశం ఇవ్వకపోవడం మొదటి నుండి పలు విమర్శలకు తావిస్తుంది, అందువల్ల ఆయన ఇప్పుడు ఇద్దరు మహిళా మంత్రులను ఖచ్చితంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల్లో అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఉప సభాపతి పద్మ దేవేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, కోవా లక్ష్మి లకు అవకాశం దక్కొచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల టిడిపి నుండి తమ పార్టీలో కి వచ్చిన మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డికి కూడా మంత్రి వర్గం లోకి తీసుకుంటారని అంటున్నారు. ఇక మహిళా మంత్రుల విషయానికి వస్తే గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గా వున్న అజ్మీరా చందూలాల్ అనారోగ్య కారణాల వల్ల ఇంటినుండి బయటకు కదలలేకపోతున్నారని, ఆయన స్థానం లో అదే వర్గానికి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని, ఇక రెడ్డి కోటాలో సీనియర్ అయినప్పటికీ యాక్టీవ్ గా ఉండడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయిని నర్సింహారెడ్డిని రాజ్య సభకు పంపించదలచారట. ఆయన స్థానంలో డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డిని లేదా, లేదా మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి ని ఖాయంగా తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికి ఇప్పటికైనా కేసీఆర్ తమ మంత్రి వర్గం లో మహిళా మంత్రులకు అవకాశం ఇవ్వాలనుకోవడం ఒక శుభ పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…