నాయినికి హ్యాండిచ్చిన కెసిఆర్…

Sunday, November 18th, 2018, 07:07:35 PM IST

తెలంగాణలో జరుగు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి ముషీరాబాద్ అభ్యర్థిగా టికెట్‌ను తన అల్లుడికి కేటాయించాలని కోరిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి తెరాస అధినేత మొండి చెయ్యి చూపారు. ముషీరాబాద్ స్థానాన్ని అక్కడి తెరాస నేత ముఠా గోపాల్‌కు కేటాయిస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అలాగే కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మల్లయ్య యాదవ్‌కు కేటాయించారు. ముఠా గోపాల్ లాంటి నాయకుడు అయితేనే ముషీరాబాద్ స్థానాన్ని భర్తీ చేయగారు అని నిర్ణయించుకున్న కెసిఆర్, నాయిని కి మొండి చెయ్యి చూపక తప్పలేదు.

ఆ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ముఠా గోపాల్‌కు ఆ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక కోదాడ సీటు గత శుక్రవారమే పార్టీలో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు ఖరారు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్న కోదాడలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో బొల్లం మల్లయ్య యాదవ్‌కు ఆ స్థానాన్ని కేటాయించారు.పైగా ముఠా గోపాల్ బర్కత్ పుర లో జరిగే మీటింగ్ లో నాయిని చేతుల మీదుగా బి ఫారం తీసుకోని, నాయిని ఆశీర్వాదం తో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం.