ఖాళీగా దర్శనమివ్వనున్న హైదరాబాద్!

Wednesday, March 25th, 2015, 05:05:02 PM IST


క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా రేపు జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక రేపటి మ్యాచ్ లో నెగ్గిన విజేతలే ఆదివారం న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్స్ లో తలపడనున్న నేపధ్యంలో సెమీ ఫైనల్స్ లో ఏ దేశం విజయం సాధిస్తుందో అన్న ఆత్రుతలో యావత్ ప్రపంచం ఉంది. అయితే రేపు జరగబోయే మ్యాచ్ ను వీక్షించేందుకు కొందరు ఆఫీసులకు సెలవులు కూడా పెట్టేస్తున్నారాట. ఇక దీనిపై చేసిన సర్వేలో చాలామంది ఉద్యోగులు ఆరోగ్యం బాగోలేదన్న సాకుతో కార్యాలయాలకు సెలవులు పెట్టేస్తున్నారని సమాచారం. కాగా కొన్ని ఐటి సంస్థలైతే స్వచ్చందంగానే రేపు సెలవు ప్రకటించాయి. ఇక మరికొన్ని సంస్థలు తమ కార్యాలయాలలోనే ఉద్యోగులకు మ్యాచ్ చూసేందుకు ఆన్ని రకాల సౌకర్యాలను కల్పించాయట.

కాగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు గాను సెలవును ప్రకటించారు. అలాగే ఉస్మానియా, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తించనున్నట్లు సమాచారం. ఇక ఇంతమంది ఆత్రుతగా చూడబోతున్న, అత్యంత ఉత్కంఠ భరితంగా జరగనున్న రేపటి మ్యాచ్ లో భారత్ బలమైన జట్టు ఆస్ట్రేలియాపై నెగ్గి ఫైనల్స్ కు చేరుకుంటుందని ఆశిద్దాం.