అన్ని వేల కోట్ల డబ్బు ఎక్కడుంది కేసిఆర్ ?

Friday, October 19th, 2018, 12:36:56 AM IST

ఏరికోరి కొన్ని నెలల ముందే ఎన్నికల్ని ప్రవేశపెట్టి మేమే గెలుస్తాం అంటూ బీరాలు పలికిన కేసిఆర్ ఆ మాటను నెగ్గించుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపిస్తూ అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేశారు. క్రితంసారి ఇచ్చిన హామీలనే పూర్తిగా నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్న ఆయన ఈసారి ముందు వెనుక ఆలోచించకుండా రెట్టింపు వాగ్దానాలు చేసేశారు.

ఈయన చేసిన వాగ్దానాలు వింటే వీటి కోసం లక్షల కోట్ల రూపాయల్ని ఎక్కడ నుండి తెస్తారు అని గట్టిగా నిలదీయాలనిపిస్తుంది. సుమారు 45 లక్షల మంది రైతులకు లక్ష రుణమాఫీని ప్రధానంగా ప్రకటించారాయన. దీనికే బడ్జెట్లో పెద్ద మొత్తం ఖర్చు కానుంది. అలాగే అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3016 భృతి అందిస్తామన్నారు. వృద్దులకు ఆసరా పింఛన్ 1000 నుండి 2016 కి పెంచి, వారి వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 57 ఏళ్లకు కుదించారు. దీనిద్వారా మరో ఏడున్నర లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంది.

అలాగే రైతులకు ఏడాదికి ఎకరానికి పెట్టుబడి సాయాన్ని 8000 నుండి 10,000 లకు పెంచారు. 1500 గా ఉన్న వికలాంగుల పింఛన్ ను 3016కు పెంపు. మరో 2 లక్షల 60 వేల రెండు పడక గదుల ఇళ్ళు ప్రకటించారు. ఈ కొత్త వాగ్దానాలు నెరవేర్చాలంటే గత దఫాలో సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇది తాత్కాలిక మేనిఫెస్టోనేనట. మరి శాంపిల్ వాగ్దానాలే ఇలా అరచేతిలో స్వర్గం చూపిస్తుంటే పూర్తిస్థాయి మేనిఫెస్టోలోని పథకాలు కళ్ళు తిరిగి కిందపడేలా చేస్తాయేమో. ఇలాంటి వాగదానాలు చూశాక ఎన్నికల కమీషన్ ఇకపై మేనిఫెస్టోను ప్రకటచేటప్పుడు వాటిని ఎలా అమలు చేస్తారనే వివరం కూడ తప్పనిసరిగా ఇవ్వాలనే కండిషన్ పెడితే బాగుంటుందనిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments