ట్రెండీ టాక్‌ : కేసీఆర్ చారిత్ర‌క త‌ప్పిదం!

Tuesday, October 23rd, 2018, 04:00:51 AM IST

ఎప్పుడూ మోదీతో…బీజేపీ శ్రేణుల‌తో విభేధించే తెలంగాణ ఆప‌ద్ధ‌మ్మ ముఖ్య‌మంత్రి ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీని క‌లిసి వ‌చ్చిన త‌రువాత ఉన్న‌ప‌ళంగా అసెంబ్లీని డిజాల్వ్ చేయ‌డం అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. 9 నెల‌ల ప‌ద‌వీ కాలం వుండ‌గానే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీని ర‌ద్దు చేశాడు?. ముంద‌స్తుకు వెళ్లాలనే ఆలోచ‌న‌కు గ‌ల కార‌ణం ఏమిటి? బీజేపీపై ఒంటికాలిపై లేసిన కేసీఆర్ ఎందుకు రాహుల్‌ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నాడు? వీట‌న్నిటి గురించి కులంక‌షంగా ప‌రిశీలిస్తే ఓ బ‌ల‌మైన అంశం బ‌య‌ట‌ప‌డిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం పేరుతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడి చేసిన నోట్ల ర‌ద్దు, పెట్రో, డీజిల్ ధ‌ర‌ల్ని అదుపు చేయ‌లేక‌పోవ‌డం, జీఎస్టీ పేరుతో సామాన్యుడి న‌డ్డి విర‌వ‌డం వంటి తెలివిత‌క్కువ ప‌నుల కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతూ కాంగ్రెస్ పుంజుకుంటోంద‌ని, ఇది తెలంగాణ‌ రాష్ట్రానికి కూడా పాకే అవ‌కాశం వుంద‌ని గ్ర‌హించిన కేసీఆర్ 9 నెల‌ల ప‌ద‌వీ కాలం వుండ‌గానే తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దుచేసి ముంద‌స్తుకు న‌గారా మోగించాడ‌నేది అస‌లు ఎత్తుగ‌డ అని చెబుతున్నారు. దీనికి తోడు తెలంగాణ‌లో అధికార పార్టీకి వ్య‌తిరేక‌త పెరుగుతుంటే అది మ‌రింత ఉగ్ర‌రూపం దాల్చ‌కుండానే ఎన్నిక‌ల‌కు వెళితే మంచిద‌ని అసెంబ్లీని డిజాల్వ్ చేశాడ‌ని విశ్లేషిస్తున్నారంతా. అయితే ఇది స‌రైన నిర్ణ‌యం కాద‌నేది ఎక్కువ మంది చెబుతున్న మాట‌. ఇది ఆయ‌న తెలిసి తెలిసి చేసిన పెద్ద త‌ప్పిదంగా తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయ నాయ‌కుల్లో, ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ న‌డుస్తోంది.

ఓట‌మి భ‌యాన్ని ప‌సిగ‌ట్టిన కేసీఆర్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త మ‌రింత‌గా పెర‌గ‌క ముందే ఎన్నిక‌ల‌కు వెళితే త‌మ‌కు లాభంగా మారుతుంద‌ని అతిగా ఆలోచించాడ‌ని, అది మొద‌టికే చేటు తెచ్చేలా వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే 9 నెల‌ల ప‌ద‌వీ కాలంలో చెయ్యాల్సిన మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌ని పూర్తిచేసి వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మార్చుకునే వీలున్నా ఆ వైపుగా కేసీఆర్ ఆలోచించ‌క‌పోవ‌డం సోచ‌నీయ‌మ‌న్న‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం తేరాస అధినేత‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌తిప‌క్షాలు ఆ పాయింట్‌నే స్ట్రెస్ చేయ‌డానికి కార‌ణం `ఓట‌మి భ‌యం` అన్న‌దానిని జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్న‌మేన‌ని విశ్లేషిస్తున్నారు. ఈ ముంద‌స్తు గండాన్ని కేసీఆర్ అండ్ కో ఎలా అధిగ‌మిస్తారో చూడాల్సిందే.