తెలంగాణపై సవతిప్రేమ!

Saturday, November 1st, 2014, 05:30:23 PM IST


విభజన బిల్లును అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కృష్ణా వాటర్ యాజమాన్య బోర్డు జారీ చేసిన ఆదేశాలపై.. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విభజన బిల్లులోని అంశాలను ఏపి ప్రభుత్వం గౌరవించడంలేదని ఆయన తెలిపారు. ఇక బిల్లులోని అంశాలను అమలు చేయవలసిన కేంద్రం తెలంగాణ గురించి పట్టించుకోవడం లేదని కెసిఆర్ వాపోయారు. కృష్ణా వాటర్ యాజమాన్య బోర్డు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణలో విధ్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నదని.. డిమాండ్ కు తగినంత విధ్యుత్ ను రైతులకు అందించలేకపోతున్నామని.. కాబట్టి రైతులు రబీ సీజన్ లో ఆరుతడి పంటలు వేసుకోవాలని కెసిఆర్ సూచించారు.

ఛత్తీస్ గడ్ నుంచి విధ్యుత్ ను కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతామని కెసిఆర్ తెలిపారు. అంతేకాకుండా.. పవర్ గ్రిడ్ నుంచి పెద్దఎత్తున విద్యుత్ ను కొనుగోలు చేయనున్నట్టు కెసిఆర్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ న్యాయబద్దంగా తమకు ఇవ్వవలసిన 54శాతం వాటా కరెంట్ ను ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు.