జాతి కెక్కిన కెసిఆర్ ఖ్యాతి

Wednesday, September 10th, 2014, 10:11:28 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మీడియాపై చేసిన ఘాటు వ్యాఖ్యాలు జాతీయ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాయి. అయితే మంగళవారం ప్రజాకవి కాళోజీ శత జయంతి వేడుకల సందర్భంగా వరంగల్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. కాగా కొద్ది రోజులుగా తెలంగాణలో నిలిచిపోయిన రెండు టీవీ చానెళ్ళ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట మహిళా జర్నలిస్టులు ఆందోళనకు దిగడం, అటుపై వారికి మద్దతుగా వరంగల్ విలేకరుల నిరసనలతో ఆగ్రహానికి లోనైన కెసిఆర్ తన ప్రసంగం ఆద్యంతం మీడియాపై నిప్పులు చెరిగారు.

కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణను కించపరిచేలా వ్యవహరించే ఏ టీవీ చానెల్ నైనా సజీవ సమాధి చేస్తామని స్పష్టం చేసారు. అలాగే రెండు టీవీ చానెళ్ళు తెలంగాణను, తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచేలా వార్తలను ప్రసారం చేసాయని, అసెంబ్లీ తీర్మానం మేరకే వాటి ప్రసారాలను తెలంగాణలో నిలిపామని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని, స్పీకర్ పరిధిలోని విషయంపై తానేమీ చెయ్యలేనని వివరించారు. ఇక ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రసారాల శాఖామంత్రి జవదేకర్ ను భేటీ సందర్భంగా ప్రసారాలు ఆపివేయ్యడంలో తమ ప్రమేయం లేదన్న కెసిఆర్ మరలా అసెంబ్లీ తీర్మానం గురించి ప్రస్తావించడంతో జాతీయ మీడియా ఒక్కసారిగా ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.