కొనితెచ్చుకున్న కష్టాల నుండి కేసిఆర్ ఎలా బయటపడతారో?

Sunday, September 16th, 2018, 05:33:08 PM IST

పార్టీలో నిగూఢంగా దాగి ఉన్న అంతరాలు ఎన్నికల సమయంలో జరిగే టికెట్ల కేటాయింపుల్లోనే బయటపడతాయనే రాజకీయ వాస్తవం టిఆర్ఎస్ విషయంలో మరోసారి రుజువైంది. ఇన్నాళ్లు అధినేత కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తూ ఆయన ప్రసన్నం కోసం పడరాని పాట్లు పడిన నేతలు కొందరు ఇప్పుడు తిరుగుబాటుదారులుగా మారిపోయారు.

తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తమకు టికెట్లివ్వలేదని కొందరు అలిగితే ఈసారి కూడ మాకు మొండి చేయి చూపుతారా అంటూ ఇంకొందరు, తమ రాజకీయవారసులకి టికెట్లివ్వలేదని ఇంకొందరు రోడ్డెక్కారు. ఈ తిరుబాటుదారులంతా చిన్నాచితకా నేతలైతే పర్వాలేదు. కానీ అందరూ పెద్దవాళ్ళే కావడంతో కేసిఆర్ కు తలనొప్పి మొదలైంది.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రాజయ్యకు టికెట్టు ఇవ్వడాన్ని సహించలేకపోయారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గీయులు. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు. వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీంద్ర తనను కాదని ఎమ్మెల్యే టికెట్ ఎర్రబెల్లికి కట్టబెట్టడం పట్ల కోపగించి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తానని సంకేతాలిస్తున్నాడు.

ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యంత బలమైన నాయకురాలు కొండా సురేఖ తనకు టికెట్ రాకపోవడంతో కేసిఆర్ పై గుర్రుగా ఉన్నారు. అక్కడి టిఆర్ఎస్ క్యాడర్ కూడ ఆమెకే పూర్తి మద్దతు ప్రకటించడం గమనార్హం. అలాగే ఆలేరు, నారాయణ్ ఖేడ్, భువనగిరి, ఖానాపూర్ లలో కూడ అసంతృప్తులు అటకెక్కారు. వారిని కిందికి దించేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు కూడ విఫలమవుతున్నాయి. మరి కొనితెచ్చుకున్న ఈ కష్టాల నుండి కేసిఆర్ ఎలా బయటపడతారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments