ఈ ముహూర్తాల లొల్లేంది కేసిఆర్ !

Sunday, October 7th, 2018, 07:14:14 PM IST

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఉన్న ఆరోపణల్లో వాస్తులు చూసుకుని పరిపాలన చేస్తారనేది కూడ ఒకటి. వాస్తు బాగోలేదని కొత్త సెక్రటేరియట్ కట్టించిన కేసిఆర్ ముహూర్తం చూసుకునే అసెంబ్లీని రద్దుచేశారని ఇప్పటికే ఆయనపై రకరకాల వార్తలు వస్తుండగా ఎన్నికలకు కూడ ఆయన ముహూర్తం సెట్ చేసుకుని కూర్చున్నారని, ఆ ముహూర్తాన ఓటింగ్ జరిగితే తాను గెలవడం ఖాయమని కేసీఆర్ అనుకున్నారని కానీ ఇప్పుడు ఈసీ ప్రకటించిన తేదీలు తనకు అనుకూలంగా లేవని కంగారుపడుతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.

ఈసీ డిసెంబర్ 7న ఓటింగ్ నిర్వహించి 11న కౌటింగ్ చేసి అదే రోజున ఫలితాలు వెలువరించాలని నిర్ణయించింది. కానీ 7న అమావాస్య, 11న చవితి కావడం తనకు కలిసిరాదని కేసిఆర్ అనుకుంటున్నారట. పలువురు వేదం పండితులు సైతం ఈ వార్తలను బలపరుస్తూ ఏవేవో లెక్కలుం నక్షత్రాలు, తిధుల పేర్లు చెబుతున్నారు. అయినా చెప్పిన హామీలను నెరవేర్చాం, ఏ ప్రభుత్వమూ చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో చేసి చూపించాం, ప్రజా తీర్పు మా పక్షానే ఉందని అదే పనిగా సభలు, సమావేశాల్లో ఊదరగొడుతున్న కేసిఆర్ అవన్నీ నిజంగా చేసుంటే ఈ ముహూర్తాలు, మట్టిగడ్డలు ఏమీ చేయలేవని, ప్రజల మైండ్ సెట్ మీద ఎలాంటి ప్రభావాన్నీ చూపలేవని ఆలోచించలేకపోతున్నారెందుకు.