కేసీఆర్ ను కంగారు పెడుతున్న జానారెడ్డి !

Wednesday, September 19th, 2018, 11:21:40 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తీసుకున్న మయోజకవర్గ మార్పు నిర్ణయం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కొంత కంగారు పడుతోందని చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ ఎంపీగా నెగ్గిన గుత్తా సుఖేందర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలుపొందిన భాస్కర్ రావు ఇద్దరూ అధికార పార్టీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసిఆర్ కూడ గుత్తా సుఖేందర్ కు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి మంచి ప్రాధాన్యమే ఇచ్చారు.

దీంతో ఈసారి ఎన్నికల్లో మిర్యాలగూడ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి కరువయ్యాడు. ఈ లోటును భర్తీ చేసేందుకు స్వయంగా జానారెడ్డి తన నాగార్జున సాగర్ నియోజక వర్గాన్ని కుమారుడు రఘువీర్ కు వదిలి మిర్యాలగూఢ నుండి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మిర్యాలగూడలో జానాకు బలమైన క్యాడర్ ఉండటం, ఆయన ఒకప్పటి శిష్యుడు, కాంగ్రెస్ నుండి జంప్ అయిన తాజా మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడ తాను జానాపై పోటీకి దిగనని తప్పుకోవడంతో కేసిఆర్ ఆలోచనలో పడ్డాడు.

చివరికి జానాను ఢీ కొట్టేందుక గుత్తా సుఖేందర్ ను బరిలోకి దింపాలని డిసైడయ్యారు. ముందుగా గుత్తాను హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై లేదా కోదాడ నుండి పోటీకి నిలపాలని కేసిఆర్ యోచన చేయగా జానా మూలాన ఆయన్ను కాస్త మిర్యాలగూఢకు మార్చాల్సి వచ్చింది. దీంతో హుజూర్ నగర్లో బలమైన క్యాడర్ ఉన్న ఉత్తమ్ కుమార్ పై పోటీకి మరో అభ్యర్థిని వెతకాల్సిన పరిస్థితి తెలెత్తింది. ఈ వరుస మార్పులు చూస్తుంటే తొలిదశ అభ్యర్థుల జాబితాలో ఇంకొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.