2019 ఎలక్షన్ : లెక్కేంటో అప్పుడే చెప్పేసిన కేసీఆర్ !

Thursday, October 26th, 2017, 11:43:10 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆఫీస్ లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 96 నుంచి 104 సీట్లు ఖాయమని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. రాష్ట్రంలో విపక్షాల కథ ముగిసిందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. విపక్షాలు బలహీనంగా ఉన్నపటికీ నేతలెవరూ ఏమరపాటుగా ఉండవద్దని సూచించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఎలాంటి ప్రశ్న వేసిన సమాధానం చెప్పే విధంగా ఎమ్మెల్యేలు అంతా ప్రిపేర్ అయి రావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 90 శాతం సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇస్తానని అన్నారు. అసెంబ్లీలో మన వాదన స్పష్టంగా ఉండాలని ఎమ్మెల్యే లకు సూచించారు.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో పొత్తు ఆలోచన ఏమాత్రం లేదనే సంకేతాలు అందుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బిజెపి పైకి గంభీరంగా ఉన్నా.. టిఆర్ఎస్ తో పొత్తు విషయమై అంతర్గతంగా చర్చించుకుంటోంది. మరో వైపు టి టిడిపి కూడా టిఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధంగానే ఉంది. ఈ ఆశావాహులందరికి కేసీఆర్ వ్యాఖ్యలు నిరాశ కలిగించే విధంగా ఉన్నాయని అంటున్నారు. సొంతంగానే 100కి పైగా సీట్లు గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్న కేసీఆర్ ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నట్లు చెప్పకనే చెప్పారు.