ఆ రెండు సీట్ల మీద ఈసారి కూడా కేసిఆర్ కు ఆశల్లేవ్ !

Monday, October 22nd, 2018, 03:48:11 PM IST

గత ఎన్నికల్లో కారు స్పీడు ఎంత వేగంగా ఉన్నా కొన్ని చోట్ల మాత్రం బ్రేకులు పడక తప్పలేదు. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ సీనియర్ నేతలు నిలబడిన కొన్ని చోట్ల టిఆర్ఎస్ ఓటమిని చవిచూడక తప్పలేదు. అందుకే తరవాతి ఎన్నికల్లో ఆ సీట్లను కూడ గెలిచి సత్తా చాటాలని కేసిఆర్ 2014 ప్రమాణస్వీకారం రోజునే నిర్ణయించుకున్నారు. కానీ ఆయన ఆశ ఈసారి కూడ నెరవేరేలా కనబడటం లేదు.

పోయినసారి తమ ప్రభావం ఎంత మాత్రమూ పనిచేయని నల్గొండ, గద్వాల నియోజకవర్గాల్లో ఈసారి కూడ నిరాశేనని సర్వేలు చెబుతున్నట్టు కేసిఆర్ నిన్న జరిగిన సమావేశంలో చెప్పారట. పైకి తాను నిలబెట్టిన అభ్యర్థులకు, కాంగ్రెస్ వాళ్లకు సమాన ఓట్లు వస్తున్నాయన్నారే కానీ భేదం చాలానే ఉందని తెలుస్తోంది. 2014లో నల్గొండలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 వేల పై చిలుకు మెజారిటీతో గెలవగా టిఆర్ఎస్ అభ్యర్థి దుబ్బాక నరసింహా రెడ్డి కేవలం 15000 ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో గతంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి 50,000 ఓట్లు పొందిన కంచర్ల భూపాల్ రెడ్డిని పార్టీలోకి లాక్కుని తొలిదశ జాబితాలో టికెట్ కేటాయించినా ఈసారి కూడ గెలుపు క్లిష్టమనే సంకేతాలు వస్తున్నాయి.

ఇక మరొక కాంగ్రెస్ సీనియర్ నేత డి.కె. అరుణకు కంచు కోట అయిన గద్వాల నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగవేరేయాలన్న కేసిఆర్ కల కూడ మళ్ళీ కలగానే మిగిలేలా కనిపిస్తోంది. క్రితంసారి టిఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమూర్తి 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో అరుణ చేతిలో ఓటమి చవిచూడగా ఈసారి కూడ ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టారు కేసిఆర్. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ఈసారి కూడ గద్వాల జనం అరుణ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి కూడా ఈ రెండు సీట్లు పై కేసిఆర్ కు పెద్దగా నమ్మకాలు లేవని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments