కేసీఆర్ క్ష‌మాప‌ణ జ‌రిగే ప‌నేనా?

Tuesday, October 30th, 2018, 10:08:07 AM IST

సూర్యుడు తూర్పునే ఉద‌యిస్తాడు.. ప‌డ‌మ‌ర‌న‌ అస్త‌మిస్తాడు.. ఏదో జ‌రిగిపోతోంది క‌దా అని ప‌డ‌మ‌రన‌ ఉద‌యంచి.. తూర్పున అస్త‌మించ‌డు.. అది ప్ర‌కృతి విరుద్ధం. తెలంగాణ ఉద్య‌మ‌నేత, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి కూడా అంతే. తాను అనుకున్న‌ది చేయ‌డ‌మే త‌న పంథా. అందుకే ఆయ‌న‌ను కేసీఆర్ అన్నారు. త‌నవైన‌ వాడివేడి మాట‌ల‌తో సెగ‌ పుట్టించి స‌మ‌స్త తెలంగాణ ప్ర‌జానీకాన్ని ఒక‌తాటిపైకి తీసుకొచ్చి ఉద్య‌మాన్ని మంచి ఊపుమీదికి తీసుకొచ్చి తెలంగాణ సాధించాడంటే ఆయ‌న గురించి త‌క్కువ అంచ‌నా వేయ‌డం అవివేక‌మే అవుతుంది. అయితే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు, తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ ఒత్త‌డి దృష్ట్యా కేసీఆర్‌లో మార్పు రావాల్సిందేనా..అదే సెటిల‌ర్స్ కోరుకుంటున్నారా? అంటే తాజా ప‌రిస్థితులు అవున‌నే సంకేతాలిస్తున్నాయి.

ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్రా పాల‌కుల‌పై, నాయ‌కుల‌పై ఒంటికాలిపై లేచి ప‌తాక స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన కేసీఆర్ ఈ ఎన్నిక‌ల స‌మ‌రాన గెలిచి గ‌ట్టెక్కాలంటే మ‌మ్మ‌ల్ని ప్ర‌స‌న్నం చేసుకోక త‌ప్ప‌ద‌ని సెటిల‌ర్‌లు గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని నిజాం పేట‌లో నిర్వ‌హించిన `హ‌మారా హైద‌రాబాద్‌` కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇదే వేదికపై కేటీఆర్ ను కొంత మంది సెటిల‌ర్‌లు త‌మకున్న అనుమానాల్ని నివృత్తి చేసుకోవ‌డం కోసం కొన్ని ప్న‌శ్న‌లు వేసి ఇబ్బందిపెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త కొంత కాలంగా, ఉద్య‌మ స‌మ‌యంలోనూ కేసీఆర్ సెటిల‌ర్‌ల‌పై, ఆంధ్రా నాయ‌క‌గ‌ణంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అది మాకు తీవ్ర మ‌న‌స్థాపాన్ని క‌లిగిస్తోంది. మీపై మా వైఖ‌రిలో మార్పు రావాలంటే కేసీఆర్ వైఖ‌రి మారాలి, లేదా సెటిల‌ర్‌ల‌కు కేసీఆర్ చేత క్ష‌మాప‌ణ అయినా చెప్పించాల‌ని పెద్ద బాంబే వేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ సీమాంధ్రుల‌కు అండ‌గా నేనున్నాన‌ని భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. అత‌ని స‌మాధానంతో సెటిల‌ర్‌లు స‌ర్దుకున్నా స‌ర్ధుకోక‌పోయినా కేసీఆర్ నుంచి క్ష‌మాప‌ణ‌లు కోరినంత ఈజీగా రావ‌న్న విష‌యం వారికీ తెలుసు. తెలిసి తెలిసి ఎందుక‌లా కోరుతున్నారు? అలా కోర‌డం వెన‌క ఎవ‌రున్నారు?. దీనికి స్కెచ్ వేసిందెవ‌రు? ఉన్న‌ట్టుండి సెటిల‌ర్‌ల‌ను ఎగ‌దోస్తోందెవ‌రు? అనే అనుమానాలు మాత్రం స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.