కేటిఆర్ ను కూడ కనికరించని కేసిఆర్ !

Tuesday, October 2nd, 2018, 12:19:42 PM IST

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేసిఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ జాబితాతో టికెట్ ఆశించిన చాలా మంది అలక బూనారు. అలా అలిగిన వారిలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడ ఒకరు. మేయర్ గా పదవీ భాద్యతలు చేపట్టినప్పటి నుండి రాబోయే ఎన్నికల మీదే ఆశలుపెట్టుకున్న రామ్మోహన్ తన చర్లపల్లి డివిజన్ ఉప్పల్ నియోజకవర్గంలో ఉండటంతో ఈసారి అక్కడి నుండే పోటీ చేయాలని నిర్ణయించుకుని ఆ దిశగా పనిచేశారు.

కానీ తొలి దశ జాబితాలో ఉప్పల్ టికెట్టుని కేసిఆర్ గతంలో పోటీచేసి ఓడిపోయిన భేటీ సుభాష్ రెడ్డికే కేటాయించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకుని కొన్ని రోజులు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఉప్పల్ టికెట్ కోసం తనకు అత్యంత సన్నిహితుడు కేటిఆర్ చేత కూడ సిఫార్సు చేయించాలని ప్రయత్నించారు. రామ్మోహన్ ను సోదరుడిగా భావించే కేటీఆర్ సైతం అతనికి టికెట్ ఇప్పించేందుకు బాగానే ప్రయత్నాలు చేశారట. చివరి నిముషంలోనైనా తండ్రి రామ్మోహన్ కు టికెట్ ఇస్తారని ఆయన ఆశించారట.

కానీ కేసిఆర్ మాత్రం కుమారుడి సిఫార్సుని కూడ లెక్కచేయలేదు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని అందరికీ స్పష్టం అయ్యేలా సంకేతాలిచ్చారు. దీంతో కేటిఆర్ కూడ ఏమీ చేయలేక మిన్నకుండిపోయి, స్నేహితుడికే నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారట. కేటిఆర్ మాటలతో అలక వీడిన రామ్మోహన్ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రస్తుతం నగరంలోని తనలాంటి అసంతృప్తులను బుజ్జగించే పనుల్లో నిమగ్నమయ్యారు.