రానున్న ఎన్నికల్లో తమ పార్టీకొచ్చే సీట్ల పై కేసీఆర్ జోస్యం?

Wednesday, January 31st, 2018, 02:52:24 PM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తమ వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థుల పై ఎలా విజయం సాధించాలనే దిశగా ఆలోచనలు చేయడం సహజం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మాత్రం రానున్న ఎన్నికలకు తాము ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్దమే అని పార్టీ లోని సన్నిహితులతో తన మనసులోని మాట చెప్పినట్లు వార్త అందుతోంది. నిజానికి అధికార పార్టీకి ఎన్నికల భయం కాస్త ఎక్కువగా ఉంటుంది, పైకి గుంభనంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు తమ పని తీరుపై ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో అనే భయం ప్రతి కార్యకర్తలో ఉండడం సహజం. అయితే కేసీఆర్ చెపుతున్న మాటల ప్రకారం తమ పార్టీకి మొత్తం 119 సీట్ల లో 102 వచ్చే అవకాశం వుందని, ఇటీవల తెలంగాణ రాష్ట్రం లో మూడు ప్రధాన సర్వే సంస్థలు చేసిన క్షేత్ర స్థాయి సర్వే ద్వారా వచ్చిన ఫలితాలు ఈ విషయాన్ని చెపుతున్నాయని అన్నారట. అయితే 2014 లో కూడా ఇవే సంస్థలు ఇచ్చిన ఫలితాలు నిజమయ్యాయని, ఒక వేళ తమ సంస్థలు చేసిన ఈ సర్వే ఫలితాలకు, ఎన్నికల ఫలితాలకు తేడా ఉంటే తాము ఈ పని నుండి శాశ్వతంగా తప్పుకుంటామని ఆ సంస్థల వారు అన్నట్లు వార్త అందుతోంది. అయితే సర్వే సంస్థల ఫలితాలతో గర్వ పడవలసిన అవసరం లేదని, పార్టీ పరంగా ఏమైనా లోపాలుంటే వాటిని సరిచేసుకుంటూ, ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పధకాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేలా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని .ఒక వేళ ఆయనే దిగితే ఇప్పటివరకు అమలు చేసిన వాటిల్లో ఏమైనా లోటు పాట్లు ఉంటే అవన్నీ తొలగిపోవడం ఖాయమని, సర్వే సంస్థలు చెపుతున్న సీట్ల కంటే ఇంకా అధికంగానే తమ పార్టీకి సీట్లు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికి సర్వే సంస్థలు చెప్తున్నట్లు టిఆర్ఎస్ కు నిజంగానే 102 సీట్లు వస్తాయా లేక అంతకంటే ఎక్కువ, లేదా తక్కువ వస్తాయా అనేది తేటతెల్లం కావాలంటే ఎన్నికల వరకు ఆగవలసిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…..