మంత్రుల్ని ప‌రుగులు పెట్టిస్తున్న‌ గులాబీ బాస్‌?!

Wednesday, September 26th, 2018, 11:13:50 AM IST


గులాబీ బాస్ దుందుడుకు పార్టీ నాయ‌కుల్ని ప‌రుగులు పెట్టిస్తోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా మ‌రింత దూకుడు పెంచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంత్రుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. దొరికినవాళ్ల‌ను దొరికిన‌ట్టే న‌లిపేస్తున్నారు. ఎల‌క్ష‌న్‌కి ఇంకెంతో స‌మ‌యం లేదు. దీంతో ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నార‌ట‌. దీనిపై ప్ర‌స్తుతం గులాబీ పార్టీల‌నే ఎంతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గెల‌వ‌క‌పోతే చావే! అన్న‌ట్టు ఉందిట ఆయ‌న వ్య‌వ‌హారం.

నేడు అందుబాటులో ఉన్న మంత్రుల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో స‌మావేశం నిర్వ‌హించేందుకు ఆప‌ధ్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నారు. అక్టోబ‌ర్ 3నుంచి భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు అంతే భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ ఉండాల‌ని ఇప్ప‌టికే మంత్రులు, తేరాస నాయ‌కుల‌కు హుకుం జారీ చేశారు కేసీఆర్. 105స్థానాల్లో అభ్య‌ర్థుల ప్ర‌చార స‌ర‌ళి ఎలా ఉండాలి? అస‌మ్మ‌తుల‌తో డీల్ ఎలా సెట్ చేయాలి? లాంటి విష‌యాల్ని మంత్రుల‌తో చ‌ర్చించనున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. పార్టీ కేటాయించ‌ని 14స్థానాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై చ‌ర్చిస్తార‌ని ఓ లీకేజీ అందింది. ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారిగా అభ్య‌ర్థుల‌కు ప్ర‌చార‌సామాగ్రి చేరింది. 105స్థానాల్లో అభ్య‌ర్థుల మార్పు ఉంటుందా ? లేదా ? అన్న‌దానిపైనా స‌స్పెన్స్ కొన‌సాగుతోంద‌ని పార్టీకి చెందిన ఓ కీల‌క నాయ‌కుడు వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే అస‌లు గులాబీ బాస్ దూకుడేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదుట‌. ఇక‌పోతే ఆయ‌న దూకుడు చూస్తున్న ప్ర‌తిప‌క్షాలు, విప‌క్షాలు గ‌గ్గోలు పెట్టేస్తున్నాయి. ఇంత జెట్‌స్పీడ్‌తో రాకెట్ కూడా వెళ్ల‌దంటూ చెవులు కొరికేసుకుంటున్నారంతా.