కేసీఆర్ విక్ట‌రీకి `పాట సాయం` అయిత‌దా?

Wednesday, October 10th, 2018, 02:00:45 AM IST

“క‌దులుదాం రండి మనం జ‌న్మ‌భూమికీ.. త‌ల్లిపాల రుణం తీర్చుకునే తందుకు..“ ఈ పాట స‌మైక్య రాష్ట్రంలో వుండ‌గా టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఈ పాట వెన‌కున్న‌ది ఎవ‌ర‌న్న‌ది చాలా కొద్దిమందికే తెలుసు. ఈ పాట వెన‌క ఉన్న‌ది మ‌రెవ‌రో కాదు ప్ర‌స్తుత తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్‌రావు. ఆయ‌న సార‌థ్యంలోనే ఈ పాట‌కు అంకురార్ప‌ణ జ‌రిగింద‌న్న‌ది ఎంత మందికి తెలుసు. సాహిత్యం ప‌ట్ల పూర్తి అవ‌గాహ‌న వున్న కేసీఆర్ ఈ పాట‌లోని ప‌దాల‌కు క‌ర్త క‌ర్మ క్రియ‌. రాసింది సుద్దాల అశోక్‌తేజనే అయినా ఆ పాట‌లోని ప‌దాలు ప్ర‌భావ‌వంతంగా వుండ‌టానికి కార‌ణం కేసీఆరే.

ఇప్పుడు అదే పంథాను ఈ ఎన్నిక‌ల్లోనూ అవ‌లంభించబోతున్నాడు కేసీఆర్‌. తెలంగాణ‌లో పండ‌గైనా..పోరాట‌మైనా పాట‌తోనే మొద‌ల‌వుతుంది. ఇది కేసీఆర్‌కు బాగా తెలుసు. అలాంటి పాట‌ను ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చార అస్త్రంగా వాడుకోబోతున్నాడాయ‌న‌. తెలంగాణ ఉద్య‌మంలో పాట‌ను ముందుండి న‌డిపించి త‌రవాత తాను న‌డిచిన కేసీఆర్ ఎన్నిక‌ల వేళ అదే పంథాను అనుస‌రించి తెలంగాణ ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ త‌మ పార్టీపై సానుభూతిని ర‌గ‌ల్చాల‌ని భావిస్తున్నాడు.

పాట‌తోనే పార్టీ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే ప్ర‌య‌త్నాల్లో వున్నారాయ‌న‌. మాట వెళ్ల‌లేని చోటుకి పాట వెళుతుంది. పాట వెళ్ల‌లేని చోటుకి సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకుని ఉదృతంగా ప్ర‌చారం చేయాల‌న్న‌దే కేసీఆర్ ఎత్తుగ‌డ‌. ఇప్ప‌టికే ప‌లువురు గేయ ర‌చ‌యిత‌లు రాసిన పాట‌ల‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు స్వ‌రాలు స‌మ‌కూర్చిన పాట‌లు కేసీఆర్ వ‌ద్ద‌కు చేరుకున్నాయి. అందులో త‌న‌కు ప‌నికొచ్చే ఆణిముత్యాల్లాంటి పాట‌ల్ని ఎంపిక చేసి ప‌ల్లెల‌తో పాటు ప‌ట్నాల‌కు ఆ పాట‌ల రుచిని చూపించాల‌నే ప్ర‌య‌త్నాల్లో కేసీఆర్ ప్ర‌స్తుతం బిజీగా వున్నార‌ట‌. కేసీఆర్ అంత‌గా ఆధార‌ప‌డుతున్న పాట ఆయ‌న‌కు ఏ పాటి సాయంగా నిలుస్తుందో చూడాలి.