నా తాత జేజమ్మ కూడా కరెంట్ కష్టాలు తీర్చలేరు

Tuesday, September 9th, 2014, 04:06:26 PM IST


తెలంగాణ ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతామని ప్రకటించారు. అలాగే రవీంద్రభారతిని తలదన్నేలా వరంగల్ లో కాళోజీకళా క్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక కాళోజీ పేరుతో యూనివర్సిటీని కూడా నిర్మిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.

అటుపై కెసిఆర్ ప్రస్తుత సమస్యలపై స్పందిస్తూ తాను ఎప్పుడూ జీవితంలో అబద్ధపు హామీలను ఇవ్వలేదని స్పష్టం చేసారు. అలాగే ఎన్నికల సమయంలోనే మూడేళ్ళ పాటు తెలంగాణ రాష్ట్రం కరెంటు కష్టాలను అనుభవించాల్సిందేనని ప్రజలకు తెలిపానని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను కాదు కదా తన తాత జేజమ్మ కూడా తెలంగాణ కరెంట్ కష్టాలు తీర్చలేరని ఆయన తెలిపారు. కాగా మూడేళ్ళ తర్వాత మాత్రం రెప్పపాటు కాలం కూడా కరెంట్ పోనివ్వనని కెసిఆర్ హామీ ఇచ్చారు.