అవినీతి దారులపై కన్నేర్రజేసిన కేసీఆర్…లిస్టులో చంద్రబాబు ఉన్నాడా..?

Tuesday, May 8th, 2018, 10:22:36 AM IST

టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల జమానాలో జరిగిన అవినీతి, అక్రమాల పుట్టలు పగులనున్నాయి. వేల కోట్ల విలువైన ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న, దోచిపెట్టిన వారిపై నమోదైన కేసుల వివరాలను తెలంగాణ సర్కారు బయటకు తీస్తున్నది. ఉమ్మడి రాష్ట్రాన్ని 60 ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ భూములను కబ్జా చేయడంతోపాటు కొందరు నేతలు కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపై సమగ్ర విచారణకు రెండు వేర్వేరు కమిషన్లను ఏర్పాటుచేసి, సత్వరమే పరిష్కరించే దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 1999-2004 కాలంలో అడ్డగోలుగా తెలంగాణ ఆస్తులను తెగనమ్మడం, తనవారికి దోచిపెట్టడం తెలిసిందే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సాగించిన అవినీతి యజ్ఞంపై పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి.

ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటకు తీయలేదు. పైగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు సైతం యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి కీలకంగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యవంటివారు అడ్డగోలుగా దోపిడీలకు పాల్పడినట్టు విమర్శలు వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పోటీలుపడి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. వీరిపై ఆనాడు నమోదైన కేసులను కూడా తమ రాజకీయ ప్రాబల్యంతో పక్కదారి పట్టించారనే అభిప్రాయాలున్నాయి. ఏసీబీ, విజిలెన్స్, సీఐడీ తదితర నిఘా సంస్థల పరిధిలో ఉన్న ఈ తరహా కేసులన్నింటిపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కసరత్తు చేసింది. అసలీకేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకడుగువేశారు? అనేదానిపై సీఎం ఆరాతీశారు. తప్పులు చేసినవారి కేసులను ఏండ్లకు ఏండ్లు అపరిష్కృతంగా ఉంచడంలో ఆంతర్యాన్ని ప్రశ్నించారు.