బాబుగారు చూశారా మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎలా తిడుతున్నాడో !

Thursday, October 4th, 2018, 10:23:46 AM IST

నిన్న జరిగిన నిజామాబాద్ బహిరంగ సభలో కేసిఆర్ మాట్లాడిన మాటలు చంద్రబాబు గతంలో మాట్లాడిన మాటల్ని అబద్దపు మాటలని రుజువు చేశాయి. గత నెల 19న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం తీరుకు నిరసనగా తీర్మానం ప్రవేశపెట్టి చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని అనుకున్నామని, కానీ బీజేపీ అడ్డుపడిందని, ఇరు రాష్ట్రాల నడుమ గొడవ పెట్టి, బలహీనం చేసి, ఏపీకి అన్యాయం చేయాలని మోదీ భావిస్తున్నారని ఆరోపిస్తూ తాను, కేసిఆర్ జిగిరి దోస్తులన్నట్టు చెప్పారు.

కానీ నిజామాబాద్ సభలో కేసిఆర్ మాత్రం చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఏకంగా బాబును తెలంగాణ ద్రోహిగా అభివర్ణిస్తూ ఓటుకు నోటు కేసును సైతం ప్రస్తావించి ఉతికిపారేశాడు. ఆయనతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్ నేతల్ని పేరు పేరునా పేకాట ఆడుకున్నారు. కాంగ్రెస్ నేతలు మరోసారి చంద్రబాబును తెచ్చి తెలంగాణ నెత్తిన కూర్చోబెట్టాలని చూస్తున్నారు, బాబు వేళ్ళకు 500 కోట్ల డబ్బు, ప్రచారానికి మూడు హెలికాఫ్టర్లు ఇస్తున్నాడు. వీళ్ళను గెలిపించుకుని అమరావతికి తాకట్టుపోదామా అన్నారు.

కేసిఆర్ లోని ఈ ఫైర్ చూస్తే ఆయన మనసులో ఏనాడూ చంద్రబాబుతో కలిసి పనిచేయాలనే ఆలోచన కించిత్ కూడ లేదనేది స్పష్టమైంది. కానీ బాబు మాత్రం కేసిఆర్ చేతులు చాచి తనతో కౌగిలికి సిద్ధంగా ఉండగా మోడీ వచ్చి చెడగొట్టాడని, లేకుంటే తెలంగాణాలో ఇద్దరం కలిసిపోయే వాళ్లమని అన్నారు. చివరికి ఏ దారీ లేక ఆంధ్రుల బహిష్కారానికి గురైన కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఈ ఉదంతం బాబు యొక్క బూటకపు వ్యవహారాన్ని మరోసారి రుజువు చేసింది.