పోలీస్ స్టేషన్లనే అసెంబ్లీలుగా మార్చమన్న కేసీఆర్

Thursday, June 6th, 2013, 02:03:36 PM IST

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ వాదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా తెరాస అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ సాధన కోసం గట్టి కసరత్తులే చేస్తున్నారు. నల్గొండ జిల్లాకి చెందినా కోదాడ నియోజకవర్గ రాజకీయ శిక్షణ శిబిరంలో పాల్గొని నేతలకు సూచనలచ్చారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ ప్రస్తుతం తెలంగాణ అన్ని ప్రాంతాల్లోనూ తెరాస పూర్తి ఆధిపత్యాన్ని చూపుతోంది. రానున్న ఎలక్షన్స్ లో 100 ఎమ్మెల్యే సీట్లు, 16 ఎంపీ స్థానాలు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద పార్టీగా తెరాస ఆవిర్బవించబోతోంది. ఈ సారి కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సంకీర్ణ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడటం ఖాయం. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టాలని జూన్ 14 న రాజకీయ జేఏసీ చేపడుతున్న చలో అసెంబ్లీ పిలుపుకి పల్లెల నుండి ప్రజలు కదిలి రావాలి. ఒకవేళ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లనే అసెంబ్లీలుగా మార్చి తెలంగాణ చర్చ పెట్టాలని’ అన్నాడు. నీళ్ళు, నిధుల కోసమే మేము పోరాడుతున్నాం. అధ్యక్షులు, ముఖ్య మంత్రులు, స్పీకర్లు ఇలా అన్ని పదవులు ఆంధ్రులకే కట్టబెట్టే ప్రభుత్వం మనకు అవసరమా? మనం శాశ్వత గులాముల్లాగా ఉండటమేనా? అనే అంశాలపై పల్లెల్లో చర్చలు జరిపి వాళ్ళని చైతన్య వంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే మాట్లాడుతూ ‘కృష్ణా, గోదావరి నదుల నుండి 1300 టీఎంసీలు నీళ్ళు మనకు రావాల్సి ఉండగా 300 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదు. అలాగే హైదరాబాద్ ని మేమే వృద్ది చేసామంటూ సీమాంధ్ర నేతలు గొప్పలు పోతున్నారు. తెలంగాణ 10 జిల్లాల నుంచి 47 వేలకోట్ల ఆదాయం వస్తుంటే, 13 జిల్లాల ఉన్న ఆంధ్రా ప్రాంతం నుంచి 15 వేలకోట్ల ఆదాయం మాత్రమే వస్తోందని’ కేసీఅర్ అన్నారు.