పాత పగను నిద్రలేపుతున్న కేసిఆర్ !

Friday, October 5th, 2018, 09:00:06 AM IST

ఇన్ని రోజులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే లేదన్నట్టు చులకన మాటలు మాట్లాడిన కేసిఆర్ ఇప్పుడు మాత్రం తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడేనన్నట్టు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాష్ట్రం విడిపోయాక జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు, మనదంతా ఆంధ్రోళ్లకు దోచిపెట్టాడు అంటూ జనాల్లో ఉద్రేకాన్ని, బాబు పట్ల పగను లేవదీసి మెజారిటీతో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అదే ఎమోషన్ ను జనాల్లో తేవడానికి ట్రై చేస్తున్నారు కేసిఆర్.

అందుకోసమే మరోసారి చంద్రబాబును తెలంగాణ ప్రజానీకం ముందుకు తీసుకొచ్చి పాత పగను నిద్రలేపుతున్నట్టు అనిపిస్తోంది. ఏ ముహూర్తాన బాబు కాంగ్రెస్ పార్టీతో జతకట్టారో కానీ అదే కేసీఆర్ కు ఎన్నికల్లో ప్రధాన ఎజెండా అయిపోయింది. ఎక్కడ సభ పెట్టినా దాన్నే ఉటంకిస్తూ సామెతలతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు.

మొన్న నిజామాబాద్లో సభ పెట్టి చంద్రబాబును ద్రోహి అన్న ఈయన నిన్న నల్గొండ సభలో కొడితే దెబ్బకు పోయి విజయవాడలో పడ్డావ్, నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమౌతుందో చూస్కో అంటూ పేట్రేగిపోయారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీయే తమకు ప్రత్యర్థి అన్న కేసిఆర్ ఇప్పుడేమో వాళ్ళను వదిలిపెట్టి చంద్రబాబు మీద పడటం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తమ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తితో పాటు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్ మీదున్న సానుభూతి పనిచేస్తుందని ఆయన భయపడ్డట్టున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని సీన్ నుండి తప్పించేందుకు చంద్రబాబును హైలెట్ చేస్తూ ఆయనే తమకు ప్రధాన ప్రత్యర్థి అనే కలరింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు గులాబీ దళాధినేత.