2014 పరిస్థితుల్ని సృష్టించాలనుకుంటున్న కేసిఆర్ !

Wednesday, October 17th, 2018, 12:13:02 PM IST

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కేసిఆర్ ప్రచార వ్యూహం ఏమిటో స్పష్టంగా బయటపడుతోంది. తెలంగాణ మహాకూటమిలో టీడీపీ రెండవ పెద్ద పార్టీ కావడాన్ని ప్రధాన కారణంగా చూపుతూ మళ్ళీ ఆంధ్రోళ్లకు అధికారం ఇస్తారా, ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ప్రజల్లో సన్నగిల్లిపోయి ఉన్న ఆంధ్ర, తెలంగాణ భేదాన్ని నిద్రలేపే ప్రయత్నాన్ని ఇప్పటికే మొదలుపెట్టిన కేసిఆర్ దాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు.

తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వాళ్ళు తామింకా ఆంధ్రా వాళ్లమనే అనుకుంటున్నారని, అలా అనుకోవద్దని, ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడున్న మీరంతా తెలంగాణ బిడ్డలని మెత్తగా తల నిమురుతూనే అసలు ఇక్కడ చంద్రబాబు అవసరం ఏముంది, ఇక్కడున్న ఆంధ్ర ప్రజలకు బాబు ఒక శనిలా తయారయ్యారని, ఇక్కడున్న ఆంధ్రులను తాము చిన్న చూపు చూస్తున్నామనే భావనను ఆయన రెచ్చగొడుతున్నారని, ఒకవేళ గొడవలు చేయాలనుకుంటే ఏనాడో చేసేవాళ్లమని అంటూ తెలంగాణ ప్రజల్లో అహాన్ని నిద్రలేపే ప్రయత్నం చేశారు.

ఏ రకంగా చూసినా ఇది మరోసారి 2014 నాటి పరిస్థితుల్ని తిరిగి సృష్టించాలనే కేసిఆర్ ప్రయత్నంగా కనిపిస్తోంది. కేసిఆర్ వేసిన ఈ పథకం వెనుక టీడీపీ పార్టీ పట్ల ఆయనలో దాగి ఉన్న భయం కారణమా లేకపోతే తమ పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆయనచేత ఈ పని చేయిస్తోందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.