కేసీఆర్ అండ్ గ్యాంగ్‌కు అతినిద్ర రోగం?

Tuesday, May 1st, 2018, 11:07:16 PM IST


తెలంగాణ‌లో రాజ‌కీయం ర‌ణ‌క్షేత్రంగా మారుతోంది. ఒక‌రిపై ఒక‌రు తిట్ల పురాణం అందుకుంటున్న తీరు చూస్తుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కాంగ్రెస్ నేత‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు హిస్టీరియా వచ్చిందని సీఎం కేసీఆర్ విమ‌ర్శిస్తే, అందుకు ప్ర‌తిగా కేసీఆర్ అండ్ గ్యాంగ్‌కు సిజోఫెర్నియా వ్యాధి పట్టుకుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ నేడు సీరియ‌స్ అయ్యారు. మొత్తానికి ఒక‌రికి అతినిద్ర రోగం అని, వేరొక‌రికి హిస్టీరియా రోగం అని తేల్చారు.

లేనివి ఉన్నట్టుగా భ్రాంతిలో బ్రతికే అలవాటునే సిజోఫెర్నియా అంటారని, ఈ వ్యాధి కలిగిన వారు ఏమి లేకపోయినా అన్ని ఉన్నట్లుగా భ్రమల్లో ఉంటారని ఉత్త‌మ్ బ్యాచ్ వివ‌ర‌ణ ఇచ్చింది. డబుల్ బెడ్‌రూంలు కట్టకపోయినా కట్టినట్టు, దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ చేయకపోయినా చేసినట్టు, గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టు, తమనెవరూ ప్రశంసించకపోయినా జాతీయ స్థాయిలో ప్రముఖ నాయకులు ప్రశంసించినట్టు భ్రమల్లో తేలిపోతారని తేరాస నాయ‌కుల్ని ఉత్త‌మ్ అండ్ గ్యాంగ్‌ విమ‌ర్శించారు. ప‌నిలో ప‌నిగా గ్యాంగ్‌స్టర్ నయీం గ్యాంగ్‌తో సంబంధాలు బయటపడ్డ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని నయీం డైరీని మాయం చేయించిన మంత్రి అంటూ ఓ ప్ర‌ముఖ నేత పేరును ప్ర‌స్థావించారు. మొత్తానికి కేసీఆర్ గ్యాంగ్, ఉత్త‌మ్ గ్యాంగ్ మ‌ధ్య వార్ మాత్రం ప‌రాకాష్ట‌కు చేరింది.

Comments