కుదిపేస్తున్న స్పీకర్ కళ్ళజోడు..రాజీనామా చేయాలంటూ డిమాండ్..!

Sunday, February 4th, 2018, 10:33:19 PM IST

కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడి నేతలంతా సింప్లిసిటీ మైంటైన్ చేయాలి. ఏమాత్రం లగ్జరీ జీవితం అనుభవిస్తున్నారని అనుమానం కలిగినా విపక్షాలు నానా రచ్చ చేయడం ఖాయం. ఆ మధ్యన ఓ ఎమ్మెల్యే తన కుమార్తె వివాహంకు భారీ స్థాయిలో ఖర్చు చేసి వివాదాలపాలైంది. తాజాగా కేరళ స్పీకర్ శ్రీరామకృష్ణన్ తన కళ్ళ జోడు కారణంగా చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయన రూ 50 వేలు ఖరీదైన కళ్ళజోడు కొన్నారు.

ఆ డబ్బుని ఆయన ప్రభుత్వం నుంచి మెడికల్ అలవెన్స్ కింద పొందడమే ఇప్పుడు వివాదంగా మారింది. రామకృష్ణన్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు పట్టిన పట్టు వదలడం లేదు. తనకు కొంత కాలంగా కళ్ళు సరిగా కనిపించడం లేదని అసెంబ్లీలో సభికులని సరిగా గమనించలేకపోతున్నానని రామకృష్ణన్ అన్నారు. డాక్టర్ సలహా మేరకే ఈ కళ్ళజోడు ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. కళ్ళజోడు అద్దాల ఖరీదే 45 వేలు కాగా, ఫ్రేమ్ ఖరీదు రూ 4500 కావడం విశేషం. కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ ఇలా ప్రజాధనాన్ని సొంత అవసరాలకోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏంటనే ప్రశ్నలు విపక్షాల నుంచి ఎదురవుతున్నాయి.