ఎన్టీఆర్ కూడ నటుడే.. అది గుర్తించండి తెలుగు తమ్ముళ్లూ !

Wednesday, October 3rd, 2018, 02:18:38 PM IST

దక్షిణాది రాజకీయాలను బలంగా ప్రభావితం చేసిన సినీ నటులు ఎందరో ఉన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుండి ప్రస్తుతం రాష్ట్ర, దేశ స్థాయి రాజకీయాల్లో చాలా మంది నటులే ఉన్నారు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ కూడ అలాంటివాడే. 2014 ఎన్నికల్లోనే తన పవర్ చూపించిన పవన్ 2019 ఎన్నికల ఫలితాల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడనడంలో సందేహమే లేదు. కానీ ఈ వాస్తవాన్ని తెలుగు తమ్ముళ్లు ఒప్పుకోలేకపోతున్నారు.

పవన్ ను ఉద్దేశించి పదే పదే అతనికొక సినిమా నటుడు, రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపలేడు అంటున్నారు. పవన్ పై స్పందించవల్సి వస్తే బాబుతో సహా అందరూ కేవలం నటుడు మాత్రమే అంటుంటారు. అయినా టీడీపీ పార్టీని స్థాపించి, అతి తక్కువ కాలంలోనే అధికారం చేపట్టి, ప్రెజెంట్ పదవులు అనుభవిస్తున్న అనేక మందికి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కూడ సినిమా నటుడే కదా. ఈ విషయాన్నే మర్చిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు.

తాజాగా పవన్ చంద్రబాబుపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే తొందర్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని పవన్ ఒక నటుడు మాత్రమే. అతన్ని చూడటానికి జనాలు వస్తారు తప్ప ఓట్లు వేయరు. తన స్థాయి ఏమిటో తెలుసుకుని పవన్ మాట్లాడాలి అంటూ చెలరేగిపోయారు. మరి ఈ సినిమా నటుడే 2014లో తమకు అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించాడనే సంగతిని, ఎన్టీఆర్ కూడ సినిమా రంగం నుండి వచ్చినవాడేనన్న విషయాన్ని నాని గుర్తుచేసుకుంటే మంచిది.