మూవీ రివ్యూ : కేజీఎఫ్ చాప్ట‌ర్-1

Friday, December 21st, 2018, 06:28:33 PM IST

కేజీఎఫ్ చిత్రం గురించి శాండిల్ వుడ్‌లోనే కాకుండా అన్ని సినీ వుడ్స్‌లో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. క‌న్న‌డ యంగ్ హీరో య‌ష్ న‌టించిన కేజీఎఫ్ చాప్ట‌ర్-1 ట్రైల‌ర్‌తోనే అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం పై విప‌రీత‌మైన ప్ర‌మోష‌న్స్‌తో భారీ హైప్ తీసుకువ‌చ్చారు. ఈ చిత్రంలో య‌ష్ స‌ర‌స‌న హీరోయిన్‌గా శ్రీనిథి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఇక తెలుగులో వారాహి చలనచిత్రం బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి విడుదల చేస్తున్నారు. మ‌రి భారీ అంచ‌నాల‌తో ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

క‌థ :

కేజీఎఫ్ క‌థ విష‌యానికి వ‌స్తే.. కోలార్ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తెర‌కెక్కింది ఈ చిత్రం. 1951లో పుట్టిన వ్య‌క్తి అక్క‌డ గ‌నుల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే అదే సంవ‌త్స‌రంలో పుట్టిన ప‌వ‌న్ (య‌ష్‌) త‌న త‌ల్లికి ఇచ్చిన మాట కోసం ఎలాగైనా త‌న‌కంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవ‌డం కోసం ముంబై వ‌చ్చి నేర సామ్రాజ్యంలో రాకీగా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ క్ర‌మంలో కోలార్ గ‌నుల్లో నియంత‌గా అధిప‌త్యం చ‌లాయిస్తున్న గ‌రుడ‌ను చంపితే ముంబై త‌న‌దే అని.. య‌ష్‌కు ఒక క్రైమ్ వ‌ర‌ల్డ్ పెద్ద ఆఫ‌ర్ ఇస్తాడు. దీంతో అత‌న్ని చంప‌డానికి బెంగుళూరు వ‌చ్చిన రాకీ, గ‌రుడ‌ను చంపే అవ‌కాశం వ‌చ్చినా చంప‌కుండా, కోలార్ గ‌నుల్లోకి ఎంట‌ర్ అవుతాడు. దీంతో కోలార్ గ‌నుల్లోకి ఎంట‌ర్ అయిన రాకీకి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి.. అస‌లు రాకీ టార్గెట్ ఏంటి.. త‌న త‌ల్లిక ఇచ్చిన మాట ఏంటి.. చివ‌రికి గ‌రుడ‌ను చంపుతాడా లేదా తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ :

కోలార్ గోల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో చారిత్రాత్మ‌క నేప‌ధ్యంలో ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం కోసం ద‌ర్శ‌కుడు ప‌క్కాగా స్క్రిప్ట్ రాసుకోలేద‌ని చెప్పాలి. హీరోను ఎలివేట్ చేయ‌డంతోనే ఎక్కువ స‌మ‌యాన్ని వృధా చేశాడు. క‌థ‌నం అయితే మ‌రీ న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తోంది. మోతాడుకు మించి యాక్ష‌న్ స‌న్నివేశాలతో నింపేసిని ద‌ర్శ‌కుడు, సినిమాకి ఆయువు ప‌ట్టు అయిన భావోద్వేగ స‌న్నివేశాలు రాసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. హీరో ప్ర‌పంచాన్నే జ‌యించ‌డానికి వ‌చ్చాడ‌నే ఫీలింగ్ క‌లిగించేలా బ్యాగ్రౌండ్‌లో వాయిస్ చెప్ప‌డం త‌ప్పా.. ఎక్క‌డా హీరో ఎమోష‌న‌ల్ జ‌ర్నీకి సంబంధించిన సీన్లు మ‌చ్చుకైనా క‌నిపించక పోవ‌డంతో బిల్డ‌ప్ ఎక్కువ‌.. విష‌యం త‌క్కువ అనేలా ఉంటుంది. ఇక ఇంట‌ర్వెల్‌లో చిన్న ట్విస్ట్ ఇచ్చి.. బంగారు గ‌నుల్లోకి హీరో ఎంట‌ర్ అవ‌డంతో అక్క‌డి నుండి అయినా సినిమా ఆక‌ట్టుకుంటుద‌ని అనుకుంటే.. ప్రేక్ష‌కుల‌కు నిరాశే మిగులుతోంది. అయితే చివ‌రి ఇర‌వై నిముషాలు కొంచెం ఉత్కంఠం రేపినా.. అక్క‌డ కూడా ప్రేక్ష‌కుడు ఊహించ‌నిదేం జ‌ర‌గ‌క పోవ‌డంతో ఈ సినిమాకి ఇచ్చిన బిల్డ‌ప్‌కి తెర‌పడుతుంది.

ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. హీరో య‌ష్ ర‌ఫ్ లుక్‌తో చాలా ప్రెసెంటింగ్‌గా ఉన్నా.. సినిమా మొత్తం సింగిల్ ఎక్స్‌ప్రెష‌న్‌తో త‌మిళ్ హీరో విజ‌య్ ఆంటోనీని గుర్తుకు తెస్తాడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ అయినా వావ్ అనేలా లేక‌పోవ‌డంతో ఈ సినిమాకి మ‌రో మైన‌స్. ఇక హీరోయిన్ శ్రీనిథి శెట్టిని ఎందుకు పెట్టారో ద‌ర్శ‌కుడికే తెలియాలి. రెండు మూడు సీన్లతో సైడ్‌ క్యారెక్టర్స్ కంటే దారుణంగా శ్రీనిథి క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇక ఇందులో విలన్స్ చాలామందే ఉన్నా అన్నీ డ‌మ్మీ క్యారెక్ట‌ర్లుగానే క‌నిపిస్తాయి. ఇక మెయిన్ విల‌న్ గ‌రుడ మ‌రో డ‌మ్మీ బిల్డ‌ప్ బాబా అని చెప్పొచ్చు. ఇక టెక్నిక‌ల్ ప‌రంగా చూస్తే.. భువ‌న్ గౌడ ఫొటో గ్ర‌ఫీ కొన్ని స‌న్నివేశాల్లో హైలెట్‌గా నిలిస్తే.. మ‌రి కొన్ని స‌న్నివేశాల్లో నాసిర‌కంగా ఉంది. పాట‌ల విష‌యానికి వస్తే.. ఒక్క నేప‌ధ్యంలో వ‌చ్చే సాంగ్ బాగుంది. త‌మ‌న్నా ఐట‌మ్ సాంగ్ మాత్రం వ‌రెస్ట్ అని చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అక్క‌డ‌క్క‌డా మెరిపిస్తుంది. శ్రీకాంత్ ఎడిటింగ్ విష‌యానికి వ‌స్తే.. క‌థ‌, క‌థ‌నంలో విష‌యం లేన‌ప్పుడు ఎడిట‌ర్ మాత్రం ఏం చేస్తాడు. ఇక ఈ సినిమా నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి. నిర్మాత విజ‌య్ బాగానే ఖ‌ర్చు పెట్టినా ద‌ర్శ‌కుడి టేకింగ్ లోపం వ‌ల్ల పెట్టిన ఖ‌ర్చు వ‌స్తుందో లేదో చూడాలి.

ప్లస్ :

య‌ష్‌

మ‌ధ‌ర్ సెంటిమెంట్

బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ :

డైరెక్ష‌న్

స్క్రీన్ ప్లే

హీరోయిన్

విల‌న్స్

తీర్పు :

కేజీఫ్ కొద్దిరోజులుగా అన్ని సినిమా ఇండష్ట్రీల్లో ఈ పేరు మారుమోగిపోయింది. అంతే కాకుండా విప‌రీత‌మైన ప్ర‌చారంతో ఓవ‌ర్ హైప్ తీసుకురావ‌డంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కుల్లో అంచానాలు పెంచేశాయి. అయితే ఈ సినిమా క‌థలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, క‌థ‌నం గ్రిప్పింగ్‌గా లేకుండా, గంద‌ర‌గోళంగా ఉండ‌డంతో, థియేట‌ర్‌కి వ‌చ్చిన ప్రేక్ష‌కులు అయోమ‌యానికి గురౌతారు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఉగ్రం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చినా.. రెండో చిత్రం కేజీఎఫ్‌తో మాత్రం ద్వితీయ విఘ్నం దాటలేక చ‌తికిలప‌డ్డాడ‌ని సినీ జ‌నాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రేటింగ్ : 2/5

తెలుగు ఇన్ పంచ్ లైన్ : బిల్డ‌ప్ ఎక్కువ‌.. విష‌యం త‌క్కువ‌

REVIEW OVERVIEW
KGF Telugu Movie Review