ఖ‌మ్మం మాజీ ఎంపీకి కేసీఆర్ ఝ‌ల‌క్‌!

Friday, March 15th, 2019, 10:02:00 AM IST

తెలంగాణ ముంద‌స్తు స‌మ‌రం నుంచి తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం స‌మూలంగా మారుతూ వ‌స్తోంది. తెలంగాణలో టీడీపీని నామ‌రూపాలు లేకుండా చేసిన కేసీఆర్ క‌న్ను ప్ర‌స్తుతం కాంగ్రెస్‌పై ప‌డింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే వారిలో ఇప్ప‌టికే ఏడుగురు ఎమ్మెల్యేలు కారెక్క‌డానికి రెడీ అయిపోయారు. మ‌రో ఏడుగురు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఖాలీ అవుతున్న సంకేతాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే చందంగా కాంగ్రెస్ సీనియ‌ర్ ఎంపీ ఒక‌రు కూడా తెరాస తీర్థం పుచ్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

త‌న‌కు ఖ‌మ్మం లేదా మ‌ల్కాజ్‌గిరి స్థానాన్ని కేటాయించాల‌ని స‌ద‌రు ఎంపీ కేసీఆర్‌ని అడిగార‌ట‌. నీకంటే పార్టీలో గెలిచే వాళ్లు చాలా మందే వున్నార‌ని, నీ అవ‌స‌రం పార్టీకి లేద‌ని, నిన్ను తెరాస‌లో చేర్చుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఖ‌రాకండీగా తేల్చిచెప్పడంతో స‌ద‌రు ఎంపీ షాక్ కు గురైన‌ట్లు తెలిసింది. ఆ త‌రువాత తేరుకున్న ఆయ‌న కేటీఆర్ నుంచి న‌రుక్కు రావాల‌ని హైద‌రాబాద్ వ‌చ్చి ఆయ‌న‌ని క‌లిశార‌ట‌. అయితే స‌ద‌రు ఎంపీకి కేటీఆర్ నుంచి కూడా ఇదే స‌మాధానం ఎదుర‌వ‌డంతో చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయిన‌ట్లు తెరాస వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇంత‌కీ కేసీఆర్ తిర‌స్క‌రించిన ఆ ఎంపీ ఎవ‌రు? నామా నాగేశ్వ‌ర‌రావా? లేక ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రినా? ఈ ఇద్ద‌రిలో ఎవ‌రిని తెరాస‌లో చేర్చుకున్నా పార్టీపై కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ప్ర‌జ‌ల్లో అప‌న‌మ్మ‌కం ముద‌ర‌డం ఖాయం. ఈ విష‌యాన్ని గ్ర‌హించారు కాబ‌ట్టి టికెట్ ఇవ్వ‌డానికి, పార్టీలో చేర్చుకోవ‌డానికి నిరాక‌రించి వుంటార‌ని అర్థ‌మ‌వుతోందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.