టీడీపీ (X) కాంగ్రెస్‌ : ఖ‌మ్మం కోసం కుస్తీ ప‌ట్లు

Monday, September 24th, 2018, 09:15:24 AM IST

ఖ‌మ్మం అసెంబ్లీ సీటు ఇప్పుడు టీడీపీ – కాంగ్రెస్‌ల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఆ సీటు మాకు కావాలంటే మాకు కావాలంటూ ఇరు ప‌క్షాలు బెట్టు చేస్తున్నాయి. ఈ స్థానం నుంచి టీఆర్ ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థానం నుంచి పోటీ చేయ‌డానికి పేరున్న అభ్య‌ర్థులెవ‌రు ముందుకు రాక‌పోవ‌డంతో పువ్వాడ అజ‌య్ గెలుపు ఖాయ‌మ‌నే ధీమాలో టీఆర్ ఎస్ శ్రేణులున్నాయి. అయితే ఊహించ‌ని విధంగా ఈ ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌద‌రి ఉవ్విళ్లూరుతున్నారు.

దాంతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకున్న తెలంగాణ రాష్ట్ర స‌మితికి పెద్ద షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. గ‌తంలో టీడీపీ నుంచి ఎంపీ స్థానానికే పోటీ చేసిన నామా నాగేశ్వ‌ర‌రావు, ఎంపీ రేణుకా చౌద‌రి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీప‌డాల‌నుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. కార‌ణం ఎంపీలుగా ఈ సారి గెలిచే సీన్ వీళ్ల‌కు లేక‌పోవ‌డ‌మేన‌ట‌. ఎంపీగా పోటీ చేసి త‌ల‌బొప్పి క‌ట్టించుకోవ‌డం కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం శ్రేయ‌ష్క‌ర‌మ‌ని భావించి ఖ‌మ్మం అసెంబ్లీ స్థానంకు పోటీ ప‌డాల‌ని భావిస్తున్నార‌ట‌. అదీ కాకుండా ఎమ్మెల్యేగా గెలిస్తే కాంగ్రెస్ రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్రొచ్చ‌ని రేణుక భారీ ప్లాన్ నే సిద్ధం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు.

ఇలా ఎవ‌రి స్కెచ్‌లు వారికి వుండంతో ఖ‌మ్మం అసెంబ్లీ సీటు టీడీపీ – కాంగ్రెస్‌ల మ‌ధ్య హాట్ సీట్‌గా మారింది. ఈ సీటు వ్య‌వ‌హారం టీడీపీ – కాంగ్రెస్‌ల మ‌ధ్య పొత్తుకు చిచ్చు పెట్టే అవ‌కాశం వుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. గెలుపొందే సీట్లు ఎవ‌రికీ ఇచ్చేది లేద‌ని ఖ‌రాకండీగా చెప్పిన కాంగ్రెస్ ఛీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఖ‌మ్మం సీటును అంత ఈజీగా టీడీపీకి వ‌దిలేసేలా క‌నిపించ‌డం లేద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ‌జ‌రుగుతున్న‌ది.