కనిపిస్తే కిడ్నాప్ చేస్తారు.. జాగ్రత్త!

Wednesday, March 14th, 2018, 03:30:59 PM IST

నిత్యం ఆకలి బ్రతుకులతో పోరాడే పేదవాళ్లు ఇంకా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. టెక్నాలిజీ ఎంత పెరుగుతున్నా నిరుద్యోగం కలవరపెడుతూనే ఉంది. ఆదాయం సరిపడా ఉన్నా కూడా దేశంలో ఆకలి చావులు తగ్గడం లేదు. ప్రస్తుతం భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో చాలా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆకలి చావులు ఎంత మాత్రం తగ్గడం లేదు. బిక్షాటన చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే అందులో ఉండే అమ్మాయిలను కొంత మంది దుండగులు వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు.

ముఖ్యంగా చిన్నారులు కొంతమంది అపహరణకు గురవుతున్నారు. గత కొంత కాలంగా మన తెలంగాణాలో ఆ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎక్కువగా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యక్తిగతంగా కొంత మంది ఇంట్లో నుంచి పారిపోతుంటే.. మరికొంత మంది అపహరణకు గురవుతున్నారు. కొంత మంది పని ఇప్పిస్తామని నిరుపేద పిల్లల్ని తీసుకెళ్లి బిక్షాటన చేయిస్తున్నారు. 2016లో 383 అపహరణకు గురైతే 348 మంది దొరికారు. అందులో ఎక్కువగా 300కు పైగా మహిళలే ఉన్నారు. ఈ అపహరణాల వెనుక పెద్ద గ్యాంగ్ లు ఉన్నాయని పోలీసుల అనుమానం. నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం వారిని వ్యభిచారం ఊబి లోకి లాగుతున్నారు. ఈ ఘటనలపై 229 కేసులు నమోదయ్యాయి.

46 కేసుల్లో అభియోగపత్రాలు నమోదవగా దాదాపు 591 మందిని అరెస్టు చేశారు. అయితే అందులో 113 మందిపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. పిల్లలని ఆదుకుంటామని చెప్పి వారిని ఇతర చోట్లకి తరలిస్తారు. అమ్మయిలను అయితే వివిధ రకాలుగా మోసం చేస్తుంటారు. వారితో మొదట స్నేహం చేసి ప్రేమలోకి దింపుతారు. ఆ తరువాత పెళ్లి పేరుతో వేరే చోటుకు తీసుకెళ్లి మత్తు మంది ఇస్తారు. అనంతరం వారిని వ్యభిచార వృత్తిలోకి దించుతారు. ఏ ఆధారం లేక జీవితం మీద నిరాశతో ఉన్న వారినే ఆ ముఠాలు టార్గెట్ చేస్తాయి. ఈ ప్రమాదాల భారిన పడకుండా తల్లి దండ్రులు జాగ్రత్త వహించాలని ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం ఇస్తామని ఆశచూపే వ్యక్తుల మాటలు ఎక్కువగా నమ్మకూడదని సూచనలు ఇస్తున్నారు.