పంజాబ్ పై కేకేఆర్ పంజా!

Saturday, May 12th, 2018, 09:50:50 PM IST


ఐపీఎల్ లో అసలైన మ్యాచ్ శనివారం జరిగింది. పంజాబ్ – కోల్ కత పోరాడిన తీరుకు అందరూ ఆకర్షితులు అయ్యారు. ప్లే హాఫ్ ఆశలు నిలుపుకోవాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో కోల్ కత అద్భుత విజయాన్ని అందుకుంది. మరో వైపు పంజాబ్ కూడా గట్టిగానే పోరాడినా విజయాన్ని అందుకోలేదు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత నిర్ణిత ఓవర్లలో 246 పరుగులు చేసింది. సునిల్‌ నరైన్‌ 75 (36) చెలరేగి ఆడాడు. 9 ఫోర్లు నాలుగు సిక్సర్లతో పంజాబ్ బాలర్లకు చుక్కలు చూపించాడు.ఆ తరువాత
ఆండ్రీ రస్సెల్‌ 31(14), కెప్టెన్ దినేష్ కార్తీక్‌ 50 పరుగులు చేసి భారీ స్కోరును అందించారు. పంజాబ్ లో ఏ ఒక్క బౌలర్ కూడా 10 ఎకనామి కంటే తక్కువ స్కోర్ ఇవ్వలేదు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాట్స్ మేన్స్ బాగానే ఆడినా 247 లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. లోకేశ్‌ రాహుల్‌ 66(29) (2×4, 7×6) చెలరేగి ఆడాడు. కెప్టెన్ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్ లో ఫెయిల్ అయినా బ్యాటింగ్ స్పీడ్ గా ఆడటానికి ప్రయత్నం చేశాడు. 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 45 పరుగులు చేసి గెలుపు పై ఆశలు రేపిన కీలక సమయంలో అవుట్ అవ్వడంతో రన్ రేట్ తగ్గిపోయింది. ఇక ఆరోన్‌ ఫించ్‌ 34 పరుగు చేశాడు. అప్పటికే ఓవర్లు తగ్గిపోవడంతో బౌండరీలకు ప్రయత్నించి కీలక ఆటగాళ్లు అవుట్ అయ్యారు. మొత్తంగా పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ లో ఆండ్రూ రసెల్‌ 3 వికెట్లు పడగొట్టగా ప్రసిధ్‌ కృష్ణ 2, నరైన్‌, కుల్‌ దీప్‌ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.