కోదండరాం ఇష్టాన్ని కాదనలేకపోతున్న కాంగ్రెస్?

Friday, September 21st, 2018, 12:05:56 AM IST

కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ముందస్తు ఎన్నికలకు పూర్తిగా సిద్ధం అంటూనే ఆ పార్టీ తడబడుతోంది. సవాల్ విసిరిన నేతలు చాలా వరకు సైలెంట్ అయ్యారు. సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం ఊహించని షాక్ ఇస్తోంది. మహాకూటమి ఏర్పాటు అయితే ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అందరూ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్దమే అని మైకుల ముందు గట్టిగా చెప్పారు కానీ సీట్ల పంపిణి విషయంలో మాత్రం తటపటాయిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి కోదండరాం టీజేఎస్ పార్టీలను కాంగ్రెస్ అధిష్టానం కంట్రోల్ చేయలేకపోతోంది. సీట్ల పంపిణీలో చర్చలు రోజు జరుపుతూనే ఉన్నా.. ఆ విషయం ఓ కొలిక్కి రావడం లేదు. ఇకపోతే టీజేఎస్ అధినేత కోదండరాం 30 వరకు సీట్లు తమ అభ్యర్థులకు కావాలని కోరుతున్నారు. కాంగ్రెస్ మాత్రం 10 సీట్ల వరకు కూడా ఇచ్చేలా లేదని టాక్. ముందుగా కోదండరాంకు నచ్చిన నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చి ఆ తరువాత అభ్యర్థులను సెట్ చేసుకుందామని కాంగ్రెస్ ఒక డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోదండరామ్ ద్రుష్టి మొదటి నుంచి సికింద్రాబాద్ పైనే ఉందట. ఎందుకంటే ఆయన ఉస్మానియా యూనివర్సిటిలో ప్రొఫెసర్ గా ఉన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో ఆ యూనివర్సిటి ఉండడం ప్లస్ పాయింట్. అలాగే ఆయనే నివాసం కూడా తార్నాక పరిధిలో ఉండడంతో పాటు లోకల్ గా పట్టు ఉండడంతో కాంగ్రెస్ కి కూడా కోదండరాం గెలుపుపై నమ్మకం ఉందట. పైగా కాంగ్రెస్ కి ఆ స్థానంలో పెద్దగా బలం లేదు. సరైన అభ్యర్థి కూడా లేకపోవడంతో కోదండరాం ఇష్టానికి పెద్దగా అడ్డు చెప్పడం లేదని సమాచారం.