సిద్దమైన కోదండరాం.. పార్టీ పేరు ఫిక్స్?

Wednesday, February 14th, 2018, 08:00:53 PM IST

తెలంగాణ ఉద్యమ సమయాల్లో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్ ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే చాలా కాలంగా టీఆరెస్ పాలనపై ఆయన అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యోగ సమస్యలపై ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతే కాకుండా ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ధర్నాలకు కూడా వెళ్లారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఫెక్ అని జేఏసీ సభ్యులు తేల్చి చెప్పారు.

ఇక తెలుగు దేశం పార్టీ వైపు కూడా వెళుతున్నట్లు కామెంట్స్ వినిపించాయి. కానీ కోదండరామ్ ఆ వార్తలను కొట్టి పారేశారు. ఫైనల్ గా పార్టీ పేరును ప్రకటించేందుకు ఒకే తేదీని ఫిక్స్ చేసుకున్నారు. భారీ బహిరంగ సభను నిర్వహించి 2011 మార్చి 10న ట్యాంక్ బండ్ పై జరిగిన మిలియన్ మార్చ్ కి గుర్తుగా.. వచ్చే నెల మార్చి 10న పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ సమితి అనే పేరును కోదండరాం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తుగా ‘రైతు-నాగలి’ని నిర్ణయించారట. త్వరలో సభను ఎక్కడ నిర్వహించాలనే విషయంపైన కూడా కోదండరాం ఒక వివరణ ఇవ్వనున్నారు.