లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీకి తెజ‌స సిద్ధం!

Thursday, March 14th, 2019, 10:37:51 AM IST

తెలంగాణ ముంద‌స్తు స‌మ‌రానికి ముందు మొద‌లైన‌ పార్టీ తెలంగాణ జ‌న‌స‌మితి (తెజ‌స‌). కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని చివ‌రి నిమిషంలో ప్రాధాన్య‌త‌లేని స్థానాల్లో పోటికి నిలిచి మ‌నుగ‌డ సాగించ‌లేని స్థితికి వెళ్లిపోయింది. ఎల‌క్ష‌న్ ఫ‌లితాల త‌రువాత క‌నీసం ప్రెస్‌మీట్ కూడా పెట్ట‌ని కోదండ‌రామ్ ఇంత కాలం సైలెంట్‌గా వుండి లోక్ స‌భ ఎన్నిక‌ల వేళ మ‌ళ్లీ తెర‌పైకొచ్చారు. బుధ‌వారం మీడియా ముందుకొచ్చిన ఆయ‌న తెజ‌స నాలుగు స్థానాల్లో పోటీకి దిగుతుంద‌ని ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

శాస‌న స‌భ ఎన్నిక‌ల త‌ర‌హాలోనే నాలుగు లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేస్తూనే మిగ‌తా స్థానాల్లో కాంగ్రెస్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని కోదండ‌రామ్ ప్ర‌క‌టించారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో స‌మ‌యం లేక‌పోవ‌డం, చివ‌రి నిమిషం వ‌ర‌కు టికెట్‌ల స‌ర్దుబాలు ప్ర‌క్రియ స‌రిగా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో కొంత గంద‌ర‌గోళం జ‌రిగింద‌ని, ఈ ద‌ఫా దానికి ఆస్కారం లేకుండా మేనిఫెస్టోని, ప్ర‌చారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేందుకు మూడు క‌మిటీల‌ను నియ‌మించామ‌ని ఈ సంద‌ర్భంగా ఆచార్య కోదండ‌రామ్ తెలియ‌జేశారు. నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మ‌ల్కాజ్‌గిరి తో పాటు మ‌రో స్థానం నుంచి పోటీకి దిగుతామ‌ని, ఈ స్థానాల‌కు రెండు రోజుల్లో అభ్య‌ర్థుల్నిప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు. ఈ నెల 16న భ‌ద్రాచ‌లం నుంచి ఆదివాసీల హ‌క్కుల ర‌క్ష‌ణ యాత్ర‌ను చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అయితే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లోనే ప్ర‌భావం చూపించ‌లేక‌పోయిన తెజ‌స లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతుంద‌న‌డం కొంత ఆశర్యాన్ని క‌లిగిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.