కోమ‌టిరెడ్డి, వీహెచ్ .. ఉంటారా వెళ‌తారా?

Saturday, September 22nd, 2018, 03:12:41 PM IST


కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తీరుతెన్నులు తొలి నుంచి ఎడ్డెం అంటే తెడ్డెం అనే తీరుగానే ఉన్నాయ‌ని కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ సాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఛీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిని ఈ సీనియ‌ర్ నాయ‌కులు ప‌దే ప‌దే తూల‌నాడ‌టం ఇదివ‌ర‌కూ చ‌ర్చ‌కొచ్చింది. ఆయ‌న్ని త‌ప్పించి త‌న‌ని పీసీసీ ఛీఫ్‌ని చేయాల‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చాలాసార్లు అధిష్ఠానానికి విన్న‌వించారు. తాజాగా మ‌రోసారి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తీరుతెన్నులు కాంగ్రెస్ అధిష్ఠానంలో సీరియ‌స్‌గా చ‌ర్చ‌కొచ్చింది. ఇటీవ‌లే ఎన్నిక‌ల క‌మిటీల నియామ‌కం వేళ దీనిపై కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ చాలానే సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలుస్తోంది.

ఆ క్ర‌మంలోనే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నిన్న‌టి రోజున అధిష్ఠాన నాయ‌కులు స‌హా కొత్త క‌మిటీలోని అంద‌రినీ తూర్పార‌బ‌ట్టారు. ఈ నియామ‌కాలు అప‌స‌వ్య దిశ‌లో సాగాయ‌ని రాజ‌గోపాల్ సీరియ‌స్ అవ్వ‌డంతో అత‌డిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకునేందుకు పార్టీ రెడీ అవుతోంది. ఆ మేర‌కు గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులైన కోదండ‌రెడ్డి, క‌మ‌లాక‌ర్‌రావు, బ‌ల‌రాం నాయ‌క్‌, సంబానీ చంద్ర‌శేఖ‌ర్ వంటి వారు సీరియ‌స్‌గానే చ‌ర్చించార‌ట‌. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జీ ఆర్‌సీ కుంతియా సైతం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్‌గానే ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక వీళ్ల‌తో పాటు మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు వి.హ‌నుమంత‌రావు పైనా క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకునేందుకు పార్టీ రెడీ అవుతోందిట‌. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్, అలానే వీహెచ్ ఇరువురూ ప‌రిస్థితి అదుపుదాటితే వెంట‌నే ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అంటే ఆ ఇద్ద‌రూ పార్టీ మార్పున‌కు వెన‌కాడ‌ర‌న్న మాట వినిపిస్తోంది. ఇక‌పోతే వీళ్ల‌పై పార్టీ అధిష్ఠానం ఏదో ఒక క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య తీసుకోక‌పోతే మునుముందు కూడా ఇలానే అవాకులు చెవాకులు పేల‌తార‌ని, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఆప‌లేమ‌ని అధిష్ఠానం భావిస్తోందిట‌. ఇక తేదేపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఓ పెద్ద మాట‌న్నారు. పీసీసీ క‌మిటీల‌న్నీ బ్రోక‌ర్ల పాల‌య్యాయి. జైలుకెళ్లి వ‌చ్చిన‌వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారంటూ కోమ‌టిరెడ్డి రేవంత్‌ని ప‌రోక్షంగా రింగులోకి లాగారు. ఇక తాడో పేడో తేల్చుకోవాల‌నే ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చా సాగుతోంది. నేటి సాయంత్రానికి వీళ్ల‌పై పార్టీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న అంచ‌నా ఉంది. ఈ నేప‌థ్యంలో అందుకు ధీటుగానే కోమ‌టిరెడ్డి, వీహెచ్ స్పందిస్తార‌ని ఆస‌క్తిక‌ర టాక్ వినిపిస్తోంది.