ఆయన ముఖ్యమంత్రి అవుతారట..సాధ్యమయ్యే పనేనా..?

Sunday, February 19th, 2017, 09:55:18 AM IST


కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిన విషయమే.కానీ ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ పార్టీ పరిస్థితి అధోగతి అని చెప్పాలి. ఏపీలో సున్నా చుట్టేసిన ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణాని ఏర్పాటు చేసినా ఆరాష్ట్రం లో పరిమిత సీట్లు మాత్రమే సాధించగలింగింది కానీ అధికారంలోకి రాలేదు.గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్ధులంటూ పేర్లు వినిపించాయి. జానారెడ్డి, డీకే అరుణ, జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య వీళ్లంతా ముఖ్యమంత్రి అభ్యర్ధులంటూ వారి వారి వర్గాలు ప్రకటించుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. తాజాగా వీరి జాబితాలో మరో నేత చేరారు. తాను తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానంటూ నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రకటించుకోవడం విషేశం. తాను ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని, కానీ ఎప్పుడు అవుతానో ఇప్పుడే చెప్పలేనని ఈ సీఎల్పీ ఉపనేత అన్నారు.

శనివారం నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలోపాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణా లో 90 సీట్లు సాధించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ ఋణం తీర్చుకుంటామని ఆయన అన్నారు.ప్రస్తుతం కేసీఆర్ జోరు, కాంగ్రెస్ ఆపార్టీ పరిస్థితి చూస్తుంటే కోమటి రెడ్డిది అత్యాశ అనిపించక మానదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఐక్యత కొరవడిందని, ఎవరికి వారు తమని పవర్ సెంటర్ లు గా ప్రజెంట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని చాటుకోవడానే ఈ వ్యాఖ్యలు చేసారని అంటున్నారు.