అవ‌మానం అంటూనే.. పార్టీ మార‌ర‌ట‌!?

Tuesday, September 18th, 2018, 12:57:44 AM IST

వరంగల్ తూర్పు నియోజకవర్గం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భ‌ర్త ముర‌ళి తేరాస పార్టీని వ‌దిలి వెళ్లిపోతున్నామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఖ‌రారు చేసిన తేరాస‌ అధిష్ఠానం కొండా సురేఖ టిక్కెట్టును పెండింగులో పెట్ట‌డంతో ఆమె సీరియస్‌గానే స్పందించారు. తమ‌ను మాత్ర‌మే పెండింగులో పెట్ట‌డానికి కార‌ణ‌మేంటో తెలియ‌జేయాల‌ని, లేని ప‌క్షంలో బ‌హిరంగ లేఖ‌ను సంధిస్తామ‌ని హెచ్చ‌రించారు. త‌మ‌కు అవ‌మానం జ‌రిగిన చోట ఉండ‌బోమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే దీనిపై కేసీఆర్ ఇంత‌వ‌ర‌కూ ఏ విధంగానూ స్పందించ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అంత‌ర్గ‌తంగానే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వెతికార‌ని తెలుస్తోంది. కొండా దంప‌తుల గురించి నివేదిక తెప్పించుకున్న కేసీఆర్ ఆలోచ‌న మార్చుకుని ఒక మెట్టు దిగొచ్చార‌ని తెలిసింది. ఇంటెలిజెన్స్ నివేదిక ప్ర‌కారం. .. వ‌రంగ‌ల్ తూర్పు- ప‌శ్చిమ‌ స‌హా ప‌ర‌కాల -భూపాల ప‌ల్లి నియోజ‌క వ‌ర్గాల్లో భారీగా ఓట్ల‌ను ప్ర‌భావితం చేసే స‌త్తా కొండా దంప‌తుల‌కు ఉంద‌ని, వారిని వ‌దులుకుంటే ఆ మేర‌కు టీఆర్ఎస్‌కి న‌ష్టం త‌ప్ప‌ద‌ని నివేదిక అందిందిట‌. దీంతో కేసీఆర్ స్వ‌యంగా మెట్టు దిగొచ్చి.. నేరుగా ముర‌ళితో మాట్లాడారుట‌. వ‌రంగ‌ల్ తూర్పు టిక్కెట్టుతో పాటు వేరొక నియోజ‌క‌వ‌ర్గ టిక్కెట్టును ఇచ్చేందుకు ప‌రిశీలిస్తున్నామ‌ని క‌బురు పంప‌డంతో కొండా దంప‌తులు శాంతించార‌ని తెలుస్తోంది. ఇప్పటికైతే పార్టీ మార్పు ఆలోచ‌న విర‌మించుకునేందుకే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు మ‌ధ్య‌వ‌ర్తిత్వం ఫ‌లించింద‌ని గులాబీ కండువాల్లో చ‌ర్చ సాగుతోంది. అయితే రెండో టిక్కెట్టు గ్యారెంటీ లేక‌పోయినా ఆల్ట‌ర్నేట్ ఏర్పాట్లు ఉంటాయ‌ని, ఒక టిక్కెట్టును ఖాయం చేసుకోమ‌ని కేసీఆర్ స్వ‌యంగా హామీ ఇవ్వ‌డంతో కొండా దంప‌తులు శాంతించార‌ని చెప్పుకుంటున్నారు. పార్టీ మారితే కొండా దంప‌తుల‌కు న‌ష్టం త‌ప్ప‌ద‌ని కేసీఆర్ త‌న‌దైన శైలిలో బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశార‌ట‌.