కొండా దంప‌తుల క‌ల‌త ఏంటో?

Monday, September 10th, 2018, 02:31:02 PM IST

నాలుగుసార్లు ఓటమి ఎరుగకుండా గెలిచిన నా టికెట్ ఎందుకు ఆపారు? అంటూ తేరాస అధిష్ఠానాన్ని కొండా దంప‌తులు సురేఖ‌, ముర‌ళి నిల‌దీశారు. రెండు సీట్ల కోసం డిమాండ్ చేశామని మాపై దుష్ప్రచారం చేశారని, పొమ్మనలేక పొగ బెట్టారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ మేర‌కు ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన స‌మావేశంలో కొండా దంప‌తులు మీడియా ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది దారుణ‌మైన‌ త‌ప్పిదం. బీసీలను, మహిళలను అవమాన పరిచినట్లుగా భావిస్తున్నానని తేరాస అధిష్టానంపై ఫైర‌య్యారు కొండా సురేఖ‌. మొదటి లిస్ట్ లో నా పేరు ప్రకటించగా పోవటం బాధ కలిగించింది. సీనియర్ శాసనసభ సభ్యురాలిగా బాధ‌ప‌డ్డాను. 12లో 11 స్థానాలు ప్రకటించి నా పేరు ప్ర‌క‌టించ‌కుండా ఆపేస్తారా? ఇది ఎంత‌టి అన్యాయం? అని ప్ర‌శ్నించారు.

పరకాల టికెట్ అడిగితే.. వరంగల్ ఈస్ట్ ఇచ్చారు కేసీఆర్. అంతేకాదు.. మురలికి ఎమ్మెల్సీ ఇస్తామని, కన్విన్స్ చేసి ఒప్పించారని సురేఖ అన్నారు. పోటీలో 55వేల మెజారిటీ తో గెలిచాం.. అస‌లు మేం చేసిన తప్పేంటి? టిఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి సొంత ఖర్చులతోనే పనిచేసాం. ఏ ఎన్నికల్లో నయా పైసా తీసుకోలేదు. మహిళకు మంత్రి పదవి ఒప్పుకుని ఇవ్వలేదు అంటూ సురేఖ తీవ్ర‌మైన ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వని పార్టీ టిఆర్ఎస్ మాత్రమేన‌ని దెప్పి పొడిచారు. పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసాం. పార్టీకి నష్టం కానీ, కష్టం కానీ కలిగించలేదు.. టిఆర్ఎస్ పార్టీ నుంచి బి పారం తప్ప పైసా తీసుకోలేదని అన్నారు. ఎస్సీ మహిళ బొడిగా శోభ, ఎస్సీలు నల్లాల ఓదేలు, బాబుమోహన్‌కు కూడా టికెట్ ఆపారు. ఎంతో వెన‌కాల వ‌చ్చిన‌ దయాకర్ రావును చంకలో పెట్టుకుని తిరుగున్నారు అంటూ ఎద్దేవా చేశారు సురేఖ‌. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాం. తెలంగాణ అనేది కల్వకుంట్ల ఇల్లు కాదు. రెండు, మూడు రోజుల్లో బహిరంగ లేఖ రాస్తాం.. భవిష్యత్ కార్యాచరణ చెప్తామ‌ని ఫైర‌య్యారు. భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్ రెండూ చోట్ల నేను, నా కూతురు పోటీ చేస్తామ‌ని తెలిపారు. ఫోన్లు ట్యాప్ చేస్తారా? అంటూ త‌న‌దైన శైలిలో సురేఖ ఫైర‌య్యారు. మొత్తానికి ఎల‌క్ష‌న్ వేరు కుంపటి రాజేసింద‌ని అర్థం చేసుకోవాలి.

  •  
  •  
  •  
  •  

Comments