అలా తిట్టేసి ఇలా కాంగ్రెస్‌లో చేరిన కొండా!

Wednesday, September 26th, 2018, 10:00:43 PM IST

ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్‌కు‌.. దిల్లీ గులాంగిరి అంటూ విమర్శించే అర్హత లేద‌ని తిట్టేస్తూ ఎట్ట‌కేల‌కు కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు, యువ‌రాజా రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో నేడు దిల్లీ సాక్షిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక నేటి నుంచి కాంగ్రెస్ కండువా ధ‌రించి, పీసీసీ తెలంగాణ‌ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ వెంట‌ సేవ‌లందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

అయితే కాంగ్రెస్‌లో చేరేముందు కేసీఆర్‌కు కొండా సురేఖ రాసిన‌ బహిరంగ లేఖ గులాబీ ద‌ళాల్లో ప్ర‌కంప‌నాలు రేపుతోంది. కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించని కేసీఆర్‌.. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుచేయలేదని లేఖ‌లో విమ‌ర్శించారు. క్యాంప్ ఆఫీసు, ఫాంహౌస్‌కే కేసీఆర్‌ పాలన పరిమితమైందని తీవ్రంగా విమ‌ర్శించారు. సోనియా, రాహుల్‌ను కేటీఆర్‌ అనరాని మాటలు అంటున్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే గౌరవం ఇచ్చే పార్టీ గులాబీ పార్టీ అని తూల‌నాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ పనిచేయక‌పోయినా .. టికెట్‌ ఇవ్వకుండా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశార‌ని విమ‌ర్శించారు. త‌న‌ అనుచరులపై కేసులు పెట్టి వేధించార‌ని, ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులను కేసీఆర్‌ పట్టించుకోలేదని తీవ్రంగా విమ‌ర్శించారు. నిరుద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోలేద‌ని, ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నార‌ని అన్నారు. కేటీఆర్‌ని సీఎంని చేయాల‌ని కేసీఆర్ త‌హ‌త‌హ‌లాడుతున్నార‌ని, కాంట్రాక్ట‌ర్ల‌ నుంచి కమీషన్లు దండుకుంటున్నార‌ని తిట్టిపోశారు. ఉద్యమంలో కోదండరాంను పొగిడిన కేసీఆర్ ఇప్పుడు దూష‌ణ‌కు దిగార‌ని విమ‌ర్శించారు. ఉద్యమకారులకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వకుండా మోసం చేశారని త‌న‌దైన శైలిలో నిప్పులు చెరిగారు కొండా సురేఖ‌.