ప్చ్‌! కొండా చేరిక‌తోనే రెండో టిక్కెట్టు భ‌రోసా!!

Monday, October 1st, 2018, 01:43:12 PM IST

కొండా దంప‌తులు పార్టీతో రీయునైట్ అవ్వ‌డంతో కాంగ్రెస్‌లో ఇత‌ర నాయ‌కుల‌కు కాగ‌ల కార్యంపై ధీమా వ‌చ్చిందంటూ ఆస‌క్తిక‌ర ప్ర‌చారం సాగుతోంది. అస‌లు కాగ‌ల కార్యం అంటే? తెలియాలంటే డీప్‌గా వివ‌రాల్లోకి వెళ్లాలి. ఇటీవ‌లే లేడీ ఫైర్‌బ్రాండ్‌ కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరిక‌తో ద‌ళితుల ఓట్ల‌కు సంబంధించిన బ‌లం పెరిగింద‌ని ఆ పార్టీ ధీమాను వ్య‌క్తం చేస్తోంది. అలానే కొండా దంప‌తుల‌కు అప్ప‌జెప్పిన వ‌రంగ‌ల్ తూర్పు- ప‌ర‌కాల సీట్లలో గెలుపు ఖాయ‌మ‌న్న ధీమా కూడా కాంగ్రెస్‌లో పెరిగిందిట‌. కొండా బ‌లం గురించి తెలిసే యువ‌రాజా రాహుల్ గాంధీ ఆ రెండు సీట్ల హామీ ఇచ్చి మ‌రీ గులాబీ కండువా తొల‌గించార‌ట‌. ఆ క్ర‌మంలోనే ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపే ధ్యేయంగా కొండా దంప‌తులు ఇప్ప‌టికే ప్ర‌చార‌ బ‌రిలో దిగిపోయారు.

అంత‌కు ముందు.. ఎంతో మెలోడ్రామా న‌డుమ‌ కొండా దంప‌తులు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. రెండు సీట్లు లొల్లుతోనే కొండాకు స‌సేమిరా అన్న గులాబీ బాస్ అస‌లు త‌ను తేరాస‌ పార్టీలో ఉండ‌డం వ‌ల్ల క‌లిసొచ్చేదేమీ లేద‌ని తీసిపారేశారు. మొత్తానికి కొండా తిరిగి కాంగ్రెస్‌లో చేర‌డంతో పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగిపోతున్నారు. అదంతా అలా ఉంచితే.. కొండా సురేఖ త‌న‌కు రెండు టిక్కెట్లు ద‌క్కించుకోవ‌డంలో స‌ఫ‌ల‌మ‌వ్వ‌డంతో.. ఇప్ప‌టికే రెండు టిక్కెట్లు ఆశిస్తున్న సీనియ‌ర్ నాయ‌కులంతా ఖుషీ అయిపోతున్నార‌ట‌. త‌మ‌కో భ‌రోసా ద‌క్కింద‌ని త‌మ పుత్ర ర‌త్నాల‌కు కూడా వేరొక సీటు అధిష్టానం క‌ట్ట‌బెడుతుంద‌ని ఎంతో ఇదైపోతున్నార‌ట‌. వార‌సుల‌కు టిక్కెట్టు ఆశిస్తున్న జాబితా కాంగ్రెస్‌లో చాంతాడంత ఉంది. జానారెడ్డి – గీతారెడ్డి – డీకే అరుణ – దామోదర రాజనర్సింహా – సబితా ఇంద్రారెడ్డి – భట్టి విక్రమార్క వీళ్లంతా ఇక‌పై వార‌సుల్ని బ‌రిలో దించి స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. వార‌స‌త్వ రాజ‌కీయాల్ని కొన‌సాగించాల‌న్న ఆకాంక్ష‌తో ర‌గిలిపోతున్నారు. అయితే కొండా పార్టీలో రీయునైట్ కాక‌ముందు కాంగ్రెస్‌లో వేరే ప‌రిస్థితి ఉండేది. అస‌లు ఈ వార‌స‌త్వ రాజ‌కీయాల్ని త‌గ్గించాల‌ని ఏఐసీసీ అధిష్ఠానం భావించింది. కానీ ఇప్పుడు అత్యవ‌స‌ర ప‌రిస్థితిలో కొండా దంప‌తుల‌కు రెండు టిక్కెట్లు ఇవ్వాల్సి వ‌చ్చింది. మ‌రి వాళ్ల‌కు రెండు ఇచ్చిన‌ప్పుడు మాక్కూడా కావాలి! అంటూ ఇత‌రులు న‌సుగుడు బేరం స్టార్ట్ చేశార‌ట‌. కాగ‌ల కార్యం అంటే అర్థ‌మైందా ఇపుడైనా?