చంద్ర‌బాబును ఆడుకున్న‌ కేటీఆర్‌

Wednesday, October 10th, 2018, 11:33:32 AM IST

ముంద‌స్తు ఎన్నిక‌ల పుణ్య‌మా అని తెలంగాణ‌లో రాజ‌కీయం రస‌వ‌త్త‌రంగా మారుతోంది. విప‌క్షాలు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటూ టీఆర్ ఎస్ శ్రేణులు దూకుడు పెంచాయి. మ‌హా కూట‌మి నాయ‌కుల‌తో పాటు ప్ర‌ధానంగా కాంగ్రెస్ నాయ‌కుల‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్న తెరాస అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఏ మాత్రం జార‌విడుచుకోవ‌డం లేదు. ఇలాంటి విష‌యాల్లో జెట్ స్పీడుతో స్పందించే కేటీఆర్ కూడా మామూలు దూకుడు చూపించ‌డం లేదు. కాంగ్రెస్ నాయ‌కుల‌తో పాటు, కోదండ‌రామ్‌ను కూడా ఏకిపారేసిన కేటీఆర్ కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడు.

గ‌తంలో కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ చంద్ర‌బాబు చేసిన ట్వీట్‌ల‌ను ఆయుధంగా చేసుకుని చంద్ర‌బాబుపై కేటీఆర్ ప‌దునైన విమ‌ర్శ‌లు చేయ‌డం టీటీడీపీ శ్రేణుల‌కు మింగుడుప‌డ‌టం లేదు. గ‌తంలో కాంగ్రెస్‌ను ఇటాలియ‌న్ మాఫియా రాజ్‌తో పోల్చిన చంద్ర‌బాబు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటాడ‌ని క‌డిగిపారేశాడు. మ‌హాకూట‌మి పేరుతో మ‌హా ఘ‌టియా బంధన్ ను ఏర్పాటు చేశార‌ని అభివ‌ర్షించాడు. 2004లో టీడీపీ తెలంగాణ ఏర్పాటుకు అంగీక‌రించ‌డం వ‌ల్లే ఆ పార్టీతో క‌లిసి మ‌హాకూట‌మిలో చేరామ‌ని, కానీ టీడీపీ మాత్రం తెలంగాణ‌లో అధికారం కోస‌మే ఇప్పుడు మ‌హాకూట‌మిలో చేరింద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. కేటీఆర్ విమ‌ర్శ‌లు విన్న వారంతా ఓటుకు నోటు వ‌ల్ల త‌ల‌బొప్పిక‌ట్టినా చంద్ర‌బాబులో మాత్రం ఎలాంటి మార్పు రాలేద‌ని ఘాటుగానే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.